ఇలాంటి సవాళ్లు ఉపయోగపడతాయా?

రాజకీయాల్లో కేవలం మాటల గారడీ మీద మాత్రమే.. ప్రజలను నాయకులు బురిడీ కొట్టిస్తూ ఉంటారు. ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. ఇలాంటి మాటల గారడీలకు అంతూపొంతూ ఉండనే ఉండదు. ఆ క్రమంలో భాగంగా.. బీజెపీ…

రాజకీయాల్లో కేవలం మాటల గారడీ మీద మాత్రమే.. ప్రజలను నాయకులు బురిడీ కొట్టిస్తూ ఉంటారు. ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. ఇలాంటి మాటల గారడీలకు అంతూపొంతూ ఉండనే ఉండదు. ఆ క్రమంలో భాగంగా.. బీజెపీ కీలక నాయకులు లక్ష్మణ్ .. భారాస పార్టీకి, కాంగ్రెసుకు కూడా ఒక సవాలు విసురుతున్నారు. ‘‘తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం’’ అని ఆ పార్టీలు ప్రకటించగలవా? అని ప్రశ్నిస్తున్నారు. 

భారతీయ జనతా పార్టీ తాము గెలిస్తే.. బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది. ఆ బీసీ కార్డుతోనే ఎన్నికలను ఎదుర్కొంటోంది. ప్రధాని మోడీ రాక సందర్భంగా ఎల్బీ స్టేడియంలో బీసీ సభనే నిర్వహిస్తున్నారు. వారు బీసీ కార్డును నమ్ముకున్నారు. అయితే, తాము ప్రయోగించిన ఓటు బ్యాంకు కార్డును ఇతర బ్యాంకులు కూడా ప్రయోగించగలవా? అని లక్ష్మణ్ ప్రశ్నించడం అర్థ రహితంగా ఉంది.

భారాస కు సంబంధించినంత వరకు వారు చాలా స్పష్టంగా కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారు అనే మాట మీదనే పోతున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు అనే పాయింటే.. తమకు పెద్ద మార్కెటింగ్ ఎలిమెంట్ అవుతుందని వారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఏ సంగతీ తేల్చలేదు. అయితే తాము ఇచ్చిన హామీనే ఆ పార్టీలు ఇవ్వగలవా? అని లక్ష్మణ్ ప్రశ్నించడం ఏంటో అర్థం కావడం లేదు.

ఇలాంటి సమయంలో ఒక ప్రశ్న తలెత్తుతోంది.. లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నట్లుగా భారాస గానీ, కాంగ్రెసు గానీ.. తాము గెలిస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం అని ప్రకటించాయే అనుకుందాం. అప్పుడు .. తాము కోరినట్లుగా బీసీలకు సీఎం పోస్టు దక్కుతున్నది గనుక.. బిజెపి పోటీనుంచి తప్పుకుని.. ఆ ప్రకటించిన పార్టీకి అనుకూలంగా ఎన్నికల్లో పనిచేస్తుందా? అనేది ప్రజల సందేహం. నిజంగా వారికి ఉండే ప్రేమ అధికారం మీద కాకుండా, బీసీల మీదే అయితే గనుక.. ఇలా జరగాలి కదా.. అని అంటున్నారు.

ఈ పసలేని సవాళ్లు బిజెపికి ఓట్లు రాల్చవు. ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే,.. వారి మాటలు కూడా ఇంకో రకంగా ఉండేవేమో. కానీ.. ఈ ఎన్నికల్లో వారికి అంత సీన్లేదు గనుకనే.. బీసీ ముఖ్యమంత్రి కార్డును ప్రకటించారని.. ఇలాంటి అబద్ధపు హామీని 2014లో చంద్రబాబునాయుడు ఇచ్చి దెబ్బతిన్నారని, ఇప్పుడు బిజెపికి అంతకుమించి ఫలితం దక్కబోయేది లేదని ప్రజలు అనుకుంటున్నారు.