తెలంగాణ సెంటిమెంట్ తో రాజ‌కీయ పార్టీలు!

ఈ సంవత్సరం చివర జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్టా తెలంగాణ‌లోని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఈసారి పోటా పోటీగా నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 21 రోజులు పాటు ఉత్సవాలను…

ఈ సంవత్సరం చివర జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్టా తెలంగాణ‌లోని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఈసారి పోటా పోటీగా నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 21 రోజులు పాటు ఉత్సవాలను నిర్వహించనుంది. కాంగ్రెస్ సైతం 20 రోజులు పాటు కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అలాగే కేంద్ర ప్ర‌భుత్వ‌ ఆధ్వర్యంలో బీజేపీ గోల్కొండ కోటలో తెలంగాణ వారోత్సవాలు నిర్వహించనున్నారు.

మ‌రో ఆరు నెల‌ల్లో జరగబోయే ఎన్నిక‌లు దృష్టా..  అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం తాము పోషించిన పాత్రను చెప్పుకుంటూ పోటాపోటీగా కార్యక్రమాలను చేపడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది మేమే అంటూ చెప్పుకుంటూ.. ప‌నిలో పనిగా ప్ర‌భుత్వ ఖర్చుతో భారీగా ప్రకటనలిచ్చి పార్టీకి ప్ర‌యోజ‌న‌క‌రంగా మార్చుకునే ప‌నిలో ఉంది. ఇవాళ సీఎం కేసీఆర్ కొత్త స‌చివాల‌యంలో 21రోజుల పాటు జ‌ర‌గ‌బోయే ఉత్స‌వ‌ వేడుకలను ప్రారంభిస్తారు.

మరోవైపు అధికార పక్షంలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండానే ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా దానికి ధీటుగానే కొన్ని కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసింది. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్‌ అన్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తు.. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదంలో కీలకంగా వ్యవహరించిన నాటి లోక్‌సభకు స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి కార్యక్రమం ఏర్పాటు చేసింది.

ఇక మేము సైతం తెలంగాణ కోసం పోరాటం చేశామంటూ.. బీజేపీ కూడా నాటి ఉద్యమకారులకు చిన్నమ్మగా చిరపరిచితమైన దివంగత సుష్మాస్వరాజ్‌ పోషించిన పాత్రను మళ్లీ గుర్తుచేయనుంది. అంతేకాకుండా ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కేంద్రానికి మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతోంది. కాగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అన్ని రాజ‌కీయ పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రమే ‘శ్రీరామ రక్ష’గా భావిస్తూ తెలంగాణ అవ‌త‌ర‌ణ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా జ‌రుపుతున్నాయి.