టీచర్ల దెబ్బకు తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. కొన్ని గంటల్లోనూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న విషయాన్ని పసిగట్టిన కేసీఆర్ సర్కార్ వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టడం గమనార్హం.
తెలంగాణలో విద్యా శాఖ ఉద్యోగులు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యా శాఖ సంచాలకులు శనివారం ఆదేశాలను ఇచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలను సమర్పించాల్సి వచ్చేది. అలాగే ఇక మీదట ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పని సరి అని స్పష్టం చేశారు.
ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తమ నిరసనను వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల కంటే అవినీతిపరులు ఎవరుంటారనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. అవినీతికి ఆస్కారమే లేని తమను శంకించడం ఏంటనే నిలదీతలు ఉపాధ్యాయుల నుంచి వచ్చాయి.
ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకతను ప్రతిపక్షాలు రాజకీయంగా క్యాష్ చేసుకుంటాయని కేసీఆర్ సర్కార్ గ్రహించింది. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై జీవోను వెంటనే నిలిపివేయాలని విద్యా శాఖ కార్యదర్శిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. దీంతో విద్యాశాఖ కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఆస్తి ప్రకటన వెల్లడి ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.