భారతీయ జనతా పార్టీలోకి వెళ్లగానే చాలా బరువైన, భావోద్వేగ భరితమైన డైలాగులు వాడుతున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన త్యాగం వల్లనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందబోతున్నదని అంటున్నాడు. దానికి సంబంధించి ఆయన చెబుతున్న లాజిక్ మాత్రం ప్రజలకు అర్థం కావడం లేదు. రాజగోపాల్ రెడ్డి మాటలన్నీ రాజకీయంగా వినసొంపుగానే ఉన్నాయి గానీ.. ప్రాక్టికల్ గా అనిపించడం లేదు.
ఈరోజు నేను రాజీనామా చేయడం వలన ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తున్నారు. లేకపోతే వచ్చేవారా? మునుగోడులో ఇప్పుడు అభివృద్ధి జరగనుంది. పింఛన్లు రేషన్ కార్డులు వస్తాయి.. రోడ్లు వేస్తారు.. సర్పంచులకు నిధులిస్తారు.. అంటూ కోమటిరెడ్డి ఏకరవు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో అంటే ఆయన ఉద్దేశం బహుశా ‘బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత’ అని కాకపోవచ్చు.
ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్ మునుగోడుకు రావడం వల్ల మాత్రమే అని ఆయన చెప్పే ప్రయత్నంలో ఉండవచ్చు. కోమటిరెడ్డి చెబుతున్నట్లుగా సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గానికైనా వెళ్లారా? అనే ప్రశ్న బాగానే ఉంది. తానుచేసిన పనిని త్యాగం అని కోమటిరెడ్డి ఎలా నిర్వచిస్తున్నారనేది మాత్రమే అర్థం కావడం లేదు.
ఆయనేమీ పదవిని త్యజించలేదు. కేవలం రాజీనామా చేశారు. ఉప ఎన్నికవస్తోంది. దీనికంటె.. అంతగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని కోరుకునే నాయకుడే అయితే.. ఈ ఉపఎన్నికలో పక్కకు తప్పుకుని ఈ ఏడాది పదవిని అధికారపార్టీకే అప్పజెబితే.. ఆయన చెబుతున్నట్లుగా అభివృద్ధి మొత్తం జరుగుతుంది కద. పదవిని వదులుకున్నాడు గనుక.. నేను చేసిన త్యాగం వల్లనే ఈ అభివృద్ధి జరిగిందని చాటుకుని.. ఆయన వచ్చే ఏడాది ఎన్నికల్లో తన కొత్త పార్టీ తరఫున తలపడవచ్చు.
ఇప్పుడు జరుగుతున్నదెల్లా ఏమిటి? పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకురావడం మాత్రమే. మళ్లీ గెలవాలని ఆశిస్తున్నారు గనుక.. గెలుస్తానని ధీమాగా ఉన్నారు గనుక.. ఆయననుంచి ఎమ్మెల్యే పదవి ఎటూ వెళ్లడం లేదని అనుకుందాం. మరి ఇందులో త్యాగమేమీ లేదు కద.
ఉపఎన్నిక వలన.. కొత్తగా ఎన్నికలను ఎదుర్కోవడానికి, అమిత్ షా సభను భారీగా ఏర్పాటు చేయడానికి ఆయన ఖర్చుపెట్టబోయే కోట్ల రూపాయలు మాత్రమే త్యాగం చేసినట్టు లెక్క. ఆ డబ్బు ఖర్చు మాత్రమే త్యాగమని ఆయన అనుకుంటున్నారా? వీటికోసం పెట్టబోయే ఖర్చును ప్రజలకోసమే పెడితే.. నియోజకవర్గం రూపురేఖలు కూడా మారిపోతాయి కదా? అనేది ప్రజల సందేహం. పైగా.. అంత సొంత సొమ్ము ఖర్చుచేసిన మహానేత కింద ఈసారి ఎన్నికలు వస్తే ఢంకా బజాయించి గెలవొచ్చు. ఆ మాత్రం దానికి రాజీనామాతో తనకు పడే ఖర్చుతో పాటు, ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మీద కూడా భారం మోపడం ఎందుకు అనేది ప్రజల సందేహం.
తన రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపిలో చేరాలని, ఆ చేరిక ఘనంగా ఉండడం కోసం తాను ఒక ఉపఎన్నికను కూడా ఎదుర్కొని.. శాసనసభలో వారి బలాన్ని పెంచి ఆ కానుకతో ఆ పార్టీలోకి అడుగుపెట్టాలని కోమటిరెడ్డి అనుకుంటే తప్పులేదు. కానీ.. దానికి త్యాగం అని, ప్రజల కోరిక అని ముసుగులు తొడగదలచుకుంటేనే తప్పు!! నా నియోజకవర్గ ప్రజలు అడిగారు.. రాజీనామా చేస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు.. ఇలాంటి పడికట్టు నాటకీయ డైలాగుల్ని కట్టిపెడితేనే.. కోమటిరెడ్డి ని ప్రజలు నమ్ముతారు.