మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఉప ఎన్నికకు కౌంట్ డౌన్ మొదలైంది. పోలింగ్‌కు గంటల సమయం మాత్రమే వుంది. ఈ నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటలకు మొదలై, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సాయంత్రం ఆరు గంటలకు రాజకీయ నేతల ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో కూడా నిషేధం విధించనున్నారు.
ఇక ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పెద్ద ఎత్తున రంగం సిద్ధమైంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ ఓటర్ల మనసు చూరగొనేందుకు నువ్వా, నేనా? అనే రేంజ్‌లో తలపడుతున్నాయి. ఓటర్లకు డబ్బు, మద్యం యథేచ్ఛగా పంచుతున్నారు. ఇందులో రాష్ట్ర, జాతీయ అధికార పార్టీలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఎన్నికల అధికారులు భారీ మొత్తంలో డబ్బు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.
ఈ ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఎలా వుంటుందో ఈ ఎన్నికలో సాధించే ఓట్లపై ఆధారపడి వుంటుందని చెప్పొచ్చు.
గత ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాల రీత్యా టీఆర్ఎస్ అతి జాగ్రత్తలు తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ భవిష్యత్ ఏంటో తెలియాలంటే ఈ నెల 6న వెలువడే ఫలితం కోసం ఎదురు చూడాల్సిందే.