కదనకుతూహలం : కేసీఆర్‌పై డైరెక్ట్ ఎటాక్ !

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తుండడమే ఒక తమాషా పరిణామం. ఆయన ఏదేదో మాటలు చెప్పి.. కామారెడ్డిలో తాను పోటీచేయాలనుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అదే సమయంలో గజ్వేల్ ప్రజలతో…

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తుండడమే ఒక తమాషా పరిణామం. ఆయన ఏదేదో మాటలు చెప్పి.. కామారెడ్డిలో తాను పోటీచేయాలనుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అదే సమయంలో గజ్వేల్ ప్రజలతో మాట్లాడుతూ.. ఏదో సరదాగా పోటీచేస్తున్నా.. గెలిచినంత మాత్రాన అక్కడ ఉంటానా? నేను మీ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటా .. అని తేల్చి చెప్పారు. అంటే కామారెడ్డి ప్రజలతో కేసీఆర్ ఆడుకుంటున్నారన్నమాట.

అయితే.. కేసీఆర్ మీద ఈ రెండు నియోజకవర్గాల్లోనూ డైరెక్ట్ ఎటాక్ కు దిగడానికి ప్రత్యర్థులు సిద్ధమయ్యారు. తన సొంత నియోజకవర్గంతో పాటు, గజ్వేల్ లో కూడా పోటీచేసి.. కేసీఆర్ ను ఓడించి తీరుతాననే ప్రతిజ్ఞతో బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ రంగంలో ఉన్నారు. ఆయన గెలుపు సంగతి ఎలా ఉన్నా.. కనీసం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో ఆయన కేసీఆర్ మీద నిప్పులు కురిపిస్తారని అనుకోవచ్చు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కేసీఆర్ పై డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్నారు. సాక్షాత్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని.. కామారెడ్డిలో కేసీఆర్ మీద పోటీచేయాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. 

రేవంత్ రెడ్డి.. కొడంగల్ తో పాటు, కామారెడ్డిలో కూడా పోటీచేయబోతున్నారు. అసలే కామారెడ్డిలో గెలిచినా సరే.. వదిలేస్తానని ప్రకటించి ఒక సెల్ఫ్ గోల్ వేసుకున్న కేసీఆర్ మీద యుద్ధానికి రేవంత్ చాలా పెద్ద స్థాయిలోనే సిద్ధమవుతారని అనుకోవచ్చు.

మొత్తానికి గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కేసీఆర్ ఒకవైపు రాష్ట్రమంతా 54 సభలతో సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతూ.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ కీలక నాయకుల దాడిని ఎలా తట్టుకుంటారో వేచిచూడాలి.