టీడీపీ భ‌విత‌వ్యాన్ని నేడు తేల్చ‌నున్న బాబు!

తెలంగాణ‌లో టీడీపీ పోటీపై స‌స్పెన్ష్ కొన‌సాగుతోంది. కాంగ్రెస్ వైపు అనుకూల గాలి వీస్తుండ‌డం, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సీఎం అయ్యే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. చంద్ర‌బాబును జైలుపాలు చేయ‌డంలో బీజేపీ హ‌స్తం వుంద‌ని…

తెలంగాణ‌లో టీడీపీ పోటీపై స‌స్పెన్ష్ కొన‌సాగుతోంది. కాంగ్రెస్ వైపు అనుకూల గాలి వీస్తుండ‌డం, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సీఎం అయ్యే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. చంద్ర‌బాబును జైలుపాలు చేయ‌డంలో బీజేపీ హ‌స్తం వుంద‌ని టీడీపీ శ్రేణులు న‌మ్ముతున్నాయి. అలాగే చంద్ర‌బాబు అరెస్ట్‌కు నిర‌స‌న‌గా హైద‌రాబాద్‌లో ఆందోళ‌న‌ల‌కు పిలుపునివ్వ‌గా కేసీఆర్ స‌ర్కార్ అడ్డుకుంద‌నే ఆగ్ర‌హం కూడా వుంది. దీంతో బాబుకు శిష్యుడైన రేవంత్‌రెడ్డిని సీఎం చేసుకోవ‌డంలో త‌మ వంతు పాత్ర పోషించాల‌ని చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం ఉత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఈ క్ర‌మంలో టీడీపీ బ‌రిలో వుండ‌కూడ‌ద‌నేది క‌మ్మ సామాజిక వ‌ర్గం అభిప్రాయం. కానీ తెలంగాణ‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పోటీ చేసి తీరుతామ‌ని ఆ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ ప్ర‌క‌టించారు. ఇవాళ చంద్ర‌బాబుతో కాసాని ములాఖ‌త్‌లో క‌ల‌వ‌నున్నారు. తెలంగాణ‌లో 89 స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధ‌మైన‌ట్టు వార్త‌లొచ్చాయి.

అస‌లు పోటీ చేయాలా? వ‌ద్దా? అనేది చంద్ర‌బాబు నిర్ణ‌యిస్తార‌ని, ఇవాళ్టితో తేలిపోతుంద‌ని కాసాని తెలిపారు. ఒక‌వేళ టీడీపీ బ‌రి నుంచి త‌ప్పుకుంటే మాత్రం కాంగ్రెస్‌కు రాజ‌కీయంగా మేలు చేసేందుకే అని చెప్ప‌క త‌ప్ప‌దు. పోటీ నుంచి త‌ప్పుకుని కాంగ్రెస్‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించ‌డానికి సిద్ధ‌మై, బీజేపీ ఆగ్ర‌హానికి టీడీపీ గురి అవుతుందా? అనేది చూడాలి. అస‌లే పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో గొడ‌వ‌కు రెడీ అవుతారా? అనేది అనుమాన‌మే. 

ఈ ప‌రిణామాల రీత్యా తెలంగాణ‌లో పోటీ చేసేందుకే టీడీపీ సిద్ధ‌ప‌డుతుంద‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. ఒక‌వేళ టీడీపీ ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోతే మాత్రం.. ఇక శాశ్వ‌తంగా తెలంగాణ‌లో ఆ పార్టీ మూసేసుకోవాల్సిందే. టీడీపీ అభిమానులంతా ఏదో ఒక పార్టీని ఎంచుకోవాల్సి వుంటుంది. ఇవాళ చంద్ర‌బాబు నిర్ణ‌యాన్ని బ‌ట్టి టీటీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ రాజ‌కీయంగా కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం వుంది.