దేశానికి రెండో రాజధాని అవసరమన్నారు మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు. రెండో రాజధాని అయ్యే అన్ని అర్హతలు హైదరాబాద్‌కు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌కు రెండో రాజధాని అవసరమని అప్పట్లో రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కూడా చెప్పారన్నారు. ఎప్పటికైనా దేశానికి హైదరాబాద్ రెండవ రాజధాని అవుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు.
తెలంగాణ రాజకీయాల్లో తాను క్రియా శీలకంగా లేనంటూనే.. తెలంగాణలో పార్టీ నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడే వెల్లడిస్తారని.. రాష్ట్ర బీజేపీలో ఎటువంటి ఇబ్బందులు లేవని.. ఒకవేళ ఉంటే వాటి గురించి అధిష్టానం చూసుకుంటుందన్నారు. దేశంలో మరోసారి బీజేపీ గెలిచి, అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఢిల్లీలో కాలుష్య స్థాయి తీవ్రంగా ఉండటంతో.. దేశానికి రెండో రాజధాని కావాలని, అది హైదరాబాద్ అవుతుందన్నట్టుగా చెప్పారు. రాజకీయంగా బలపడటానికి హైదరాబాద్ ను బీజేపీ గుప్పిట్లో ఉంచుకోవాలని అనుకుంటోందని.. అందుకే హైదరాబాద్‌ని దేశ రెండో రాజధాని గా మార్చి, కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని అనుకుంటోందని బీజేపీ రాజకీయ ప్రత్యర్ధులు అనుమానిస్తున్నారు.