తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి ఉండొచ్చనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత త్వరగా పెంపొందే ప్రాంతం తెలంగాణ. ఉమ్మడి ఏపీలో కూడా సీమాంధ్రలో కన్నా రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణలోనే త్వరగా వ్యతిరేకత ప్రబలేది! అలాంటిది పదేళ్ల నుంచి టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో.. సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉండనే ఉంటుంది.
ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన నేతగా కేసీఆర్ కు సానుకూలత ఇన్నాళ్లు తేలికగా బండి నడిపించేందుకు అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ కు ఉద్యమ పార్టీ ఇమేజ్ ఎంత వరకూ నిలబెడుతుందనేది ప్రశ్నార్థకమే కావొచ్చు పదేళ్ల తర్వాత!
ఇక తెలంగాణ లో తదుపరి తమదేనని మొన్నటి వరకూ సవాళ్లు చేసిన బీజేపీకి ఇప్పుడు అంత ఊపు కూడా కనిపించడం లేదు. మరి కాలం కలిసి వచ్చి కాంగ్రెస్ కు ఈ సారి అధికారం దక్కినా పెద్ద ఆశ్చర్యం లేని పరిస్థితి.
మరి అదే జరిగితే.. రేవంత్ రెడ్డి సీఎం అవుతారా? అనేది ప్రశ్నార్థకమే అనే మాటా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ నాయకత్వానికి ఉన్న మద్దతు ఎంతో వేరే చెప్పనక్కర్లేదు! మరి బోటాబోటీ మెజారిటీ వచ్చి కాంగ్రెస్ కు అధికారం దక్కే పరిస్థితి వచ్చినా.. రేవంత్ సీఎం అభ్యర్థిత్వాన్ని మెజారిటీ కాంగ్రెస్ నేతలు గట్టిగా వ్యతిరేకిస్తారనేది వేరే చెప్పనక్కర్లేదు!
అందునా.. కాంగ్రెస్ కోలుకున్నా.. అదేమీ రేవంత్ రెక్కల కష్టం కాబోదు! కర్ణాటకలో కష్టపడ్డాడు అనే పేరున్న డీకే శివకుమార కు కూడా కాంగ్రెస్ అధినాయకత్వం అవకాశం ఇవ్వలేదు. సిద్ధరామయ్యకే అవకాశం ఇచ్చింది. అలాంటిది రేవంత్ కు సీఎం సీటు అనేది భ్రమ మాత్రమే! పార్టీ అంటూ అధికారంలోకి వస్తే.. వీహెచ్ లాంటి వాళ్లు కూడా లేచొచ్చి తనకే సీఎం పదవి అనే పరిస్థితి కాంగ్రెస్ లో ఉంటుంది. ఏదైనా జరగొచ్చు కానీ రేవంత్ కు సీఎం పీఠం దక్కే అవకాశాలు మాత్రం ఉండకపోవచ్చు. పార్టీలోని సీనియర్లు లేదా దళిత కార్డును కాంగ్రెస్ ఉపయోగించవచ్చు.