తెలంగాణ గవర్నర్ మరోసారి వివాదాస్పదమయ్యారు. తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీ వేదికగా ఆమె చేసిన కామెంట్స్‌పై పలు రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గవర్నర్‌కు రాజకీయాలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ముందుగా ఆమె ఏమన్నారో తెలుసుకుందాం.
జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాకపోవచ్చన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. గవర్నర్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవిలో ఉన్న వారికి రాజకీయాలతో పనేంటని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌కు, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. గవర్నర్ తమిళిసై హూందాగా నడుచుకుంటే బాగుంటుందని నారాయణ హితవు పలికారు. గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలని గతంలో నారాయణ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తీరుపై మండిపడ్డారు. బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదని తమిళిసైకి చురకలంటించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడ్డానికి గవర్నర్ ఎవరని బాల్క సుమన్ నిలదీశారు. గతంలో ఏ గవర్నరూ తమిళిసై మాదిరిగా ప్రవర్తించలేదన్నారు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడ్డానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తా? అని ప్రశ్నించారు.
గవర్నర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇవ్వడానికి టీఆర్ఎస్ కొందరిని మాత్రమే ఎంపిక చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి తలసాని, బాల్క సుమన్‌లతో పాటు ఎక్కువగా ఎస్సీ, బీసీ నేతల్ని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఎవరెన్ని విమర్శలు చేసినా గవర్నర్ ఏ మాత్రం వెనక్కి తగ్డడం లేదు. అందుకే తెలంగాణలో కేసీఆర్ సర్కార్, గవర్నర్ మధ్య రోజురోజుకూ వివాదం పెరుగుతూనే ఉంది.
కేసీఆర్ సర్కార్‌ను ఏదో రకంగా గిల్లడానికే గవర్నర్ మొగ్గు చూపుతున్నట్టు, ఆమె పంథాను గమనిస్తున్న వారు చెబుతున్నారు.