రాజకీయాలలో మాటలు, సవాళ్లు, విమర్శలు చాలా సహజం. అయితే వాటి పట్ల అవతలి వారు ఎలా స్పందిస్తున్నారనేది ముఖ్యం. వారి స్పందన ఈ సవాళ్లను తేలికగా తీసుకుంటున్నదా లేదా ఆ సవాళ్లకు జడుకుంటున్నదా.. అనేది వారి స్పందనను బట్టి మనకు అర్థం అవుతూ ఉంటుంది.
ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను గమనిస్తే, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పందిస్తున్న తీరు బిజెపి మరియు బి.ఆర్.ఎస్ నాయకుల సవాళ్లకు ఆయన జడుసుకుంటున్నారేమో అని అనుమానం కలిగించే లాగా ఉంది.
రేవంత్ రెడ్డి గద్దె ఎక్కిన రెండు మూడు వారాల నుంచి ఈ రెండు పార్టీలు తమ జోస్యం మొదలుపెట్టాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కూలిపోబోతున్నదని వారిద్దరూ పదేపదే చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ సర్కారు ఉండదని రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అటు బిజెపి నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు.
అయితే సుస్థిరమైన మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సాధారణ పరిస్థితిలో కూలిపోవడం అంత సులభం అనుకోలేము. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తమ ప్రతిపక్ష నాయకుల సవాళ్లకు భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.
మహబూబ్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని పోల్చడానికి మీరు ప్రయత్నం చేయండి.. అప్పుడు మీ సంగతి చూస్తా అంటూ హెచ్చరించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు అని కూడా సెలవిచ్చారు. ఈ వ్యాఖ్యలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలను కూల్చడమే బిజెపి బిఆర్ఎస్ సంస్కృతి అంతే అంటూ చెప్పిన కొన్ని మాటలు మాత్రం ఆయనలోని భయాన్ని సూచిస్తున్నాయి.
అంతే కాదు.. నలభై శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని కూలగొడతామని అనడం ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా? విజ్ఞులు మేధావులు ఆలోచించాలి. దుర్మార్గమైన రాజకీయాలకు పాతర వేయాలి.. మా ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతాం అంటున్నారు.. అంటూ ఆయన పలికిన మాటలు బేలగా ఉన్నాయి.
నిజంగానే ఏమైనా ప్రమాదం పొంచి ఉన్నదని ఆయన భయపడుతున్నారా? లేదా, ఇలాంటి మాటల ద్వారా తమ మీద కుట్ర జరుగుతున్నదని ప్రచారం చేసి.. ప్రజల సానుభూతి సంపాదించి లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టాలని అనుకుంటున్నారా? బోధపడడం లేదు. ఏది ఏమైనప్పటికీ.. ప్రభుత్వం కూలిపోతుంది అనే ప్రతిపక్షనాయకుల మాటల పట్ల రేవంత్ అతిగా స్పందిస్తున్నారని మాత్రం అర్థమవుతోంది.