అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని ప్రయత్నించి అడ్డంగా మోసపోయింది ఓ మహిళ. లక్షల్లో డబ్బు వస్తుందని ఆశపడి పోర్న్ లో నటించడానికి ఒప్పుకుంది. చివరికి ఆ వీడియోతోనే బ్లాక్ మెయిల్ కు గురైంది. విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. హైదరాబాద్ లో జరిగింది ఈ ఘటన.
విశాఖపట్నానికి చెందిన 26 ఏళ్ల మహిళ, ఉపాధి కోసం హైదరాబాద్ కు మారింది. దిల్ సుఖ్ నగర్ లో ఉంటూ పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసే కాంట్రాక్టులు చేస్తోంది. నాలుగేళ్ల నుంచి చెన్నకేశవ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఉంది. ఏళ్లుగా పరిచయస్తుడు కావడంతో, తన ఆర్థిక సమస్యల్ని అతడితో చెప్పుకుంది సదరు మహిళ.
మహిళ ఆర్థిక అవసరాల్ని గ్రహించిన చెన్నకేశవ ఆమెను ప్రలోభపరిచాడు. తనకు ఓ పెద్ద పార్టీ తెలుసని, నీలిచిత్రంలో నటిస్తే 10 లక్షలు ఇస్తారని ఆశపెట్టాడు. ముఖానికి చున్నీ కప్పుకొని పోర్న్ లో నటిస్తే ఎవ్వరికీ దొరకమంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.
10 లక్షలకు ఆశపడి సదరు యువతి పోర్న్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. చెన్నకేశవ చెప్పిన ప్రకారం, పంజాగుట్టలోని ఓ ఇంటికి వెళ్లింది. మద్యం తాగమని చెప్పగా నిరాకరించింది. దీంతో కూల్ డ్రింక్ లో మద్యం కలిపి తాగించారు. మద్యం మత్తులో పడిపోయిన ఆమెను వివస్త్రను చేసి నగ్నంగా వీడియోలు తీశాడు చెన్నకేశవ.
ఆ వీడియోల ఆధారంగా కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఫోన్ చేసి లక్ష రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నాడు. రోజురోజుకు ఈ బ్లాక్ మెయిల్ ఎక్కువ కావడంతో యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన పోలీసులు, చెన్నకేశవను అదుపులోకి తీసుకున్నారు.