తెలంగాణలో యాక్టివ్ పొలిటికల్ ఫోర్స్ అయిన రెడ్డి కులస్తుల ఓట్లు ఈ సారి ఎటు వైపు మొగ్గు చూపుతాయనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఏపీ రాజకీయంలో కూడా తెలంగాణ రెడ్లు కీలక పాత్రలే పోషించారు.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రెడ్లకు మంత్రి పదవుల్లో, కీలకమైన శాఖల్లో అగ్రతాంబూలమే దక్కింది. అయితే విభజనతో తెలంగాణలో రెడ్ల రాజకీయ శక్తి తగ్గిపోయింది! ఉమ్మడి ఏపీలోనే సీఎం పీఠానికి పోటీ అనేంత స్థాయిలో ఇమేజ్ పొందిన నేతలున్నారు. వారికి దక్కలేదు కానీ, హడావుడి అయితే ఉండేది!
ఇప్పుడు తెలంగాణ సీఎం పదవికి తగిన అభ్యర్థి అనే రెడ్డి ప్రముఖుడి పేరు గట్టిగా చెప్పలేని పరిస్థితి! రేవంత్ రెడ్డి.. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉన్నా, రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది.
ఈ మధ్యకాలంలో తెలంగాణ రెడ్లు టీఆర్ఎస్ పై కారాలూమిరియాలు నూరుతున్నారు. కుల సంఘాల భేటీలో కేసీఆర్ భజనను వారు సహించలేకపోయారు! మల్లారెడ్డి ఇలాంటిదే చేయబోయి ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. కేసీఆర్ అయితే వారికి తగిన ప్రాధాన్యతను ఇస్తూనే ఉన్నారు మొదటి నుంచి. అయితే అదంతా కేవలం ఓటు బ్యాంకు తరహా రాజకీయమే అని, మంత్రి పదవులు పేరుకే దక్కుతున్నాయని, పాలన అంతా కేసీఆర్, కేటీఆర్ కనుసన్నల్లోనే సాగుతుందనేది సర్వత్రా వినిపించే అభిప్రాయం.
టీఆర్ఎస్ లో టాప్ త్రీ నేమ్స్ చెప్పాలంటే.. ఎక్కడా రెడ్డి పేరు వినిపించదు! టాప్ త్రీ నే కాదు, టాప్ ఫైవ్, టాప్ టెన్లో కూడా ఫలానా వారున్నారని ధీమాగా చెప్పే పరిస్థితి లేదు!
కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన రెడ్లలో కొందరు ఇప్పుడు టీఆర్ఎస్ లో పాలేర్ల పరిస్థితుల్లో ఉన్నారు. ఇక మరి కొందరు కాంగ్రెస్ లోనే మిగిలారు కానీ, కాంగ్రెస్ కే ఊపు రావడం లేదు. ఇంతలో బీజేపీ వైపు కూడా కొంతమంది రెడ్డి నేతలు మొగ్గు చూపుతున్నారు. కోమటిరెడ్డి సోదరులు దాదాపు బీజేపీలో చేరినట్టే. మరోవైపు షర్మిల కూడా ఇదే వర్గం ఓట్లపై కొద్దో గొప్పో ఆశలు పెట్టుకుంది.
టీఆర్ఎస్ ఏమో బోలెడంతమంది రెడ్లకు ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్సీ నామినేషన్లు, ఎంపీ టికెట్లు, కార్పొరేటర్ అవకాశాలు, మంత్రి పదవులు అన్నీ ఇస్తోంది. కానీ, టీఆర్ఎస్ పై వ్యతిరేకత మొదలైంది రెడ్లలో. ఇక బీజేపీ రెడ్డినే సీఎం చేయడం అటుంచి, ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం లేదు. కాంగ్రెస్ కు ఛాన్సు వస్తే మాత్రం.. రెడ్డి సీఎం అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అదేమో లేపినా లేచే పరిస్థితి కనిపించడం లేదు.
ఇలా మూడు పార్టీల మధ్యనా రెడ్డి ఓట్ల చీలిక అయితే గట్టిగా ఉండబోతోంది. క్రితం సారి చంద్రబాబు నాయుడుతో గనుక కాంగ్రెస్ చేతులు కలపకపోయి ఉంటే, ఈ వర్గం ఓట్లు కాంగ్రెస్ కు భారీ ఎత్తున దక్కేవి. అప్పుడు చేసిన తప్పిదంతో మళ్లీ కోలుకోలేనంత స్థాయి లోకి వెళ్లిపోయింది కాంగ్రెస్ పరిస్థితి.