Advertisement

Advertisement


Home > Politics - Telangana

రేవంత్ కేబినెట్లో ముసలం పుట్టేలా బండి మాటలు!

రేవంత్ కేబినెట్లో ముసలం పుట్టేలా బండి మాటలు!

ఎమ్మెల్యేగా గెలవలేకపోయిన భాజపా నాయకుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇప్పుడు ఎంపీగా రెండోసారి గెలిచేందుకు అవసరమైన ప్రచారపర్వంలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తో అమీతుమీ తేల్చుకునేలా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు.

కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇప్పుడు భారాసను పెద్దగా పట్టించుకోడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పోరాటం తమ రెండు పార్టీల మధ్య మాత్రమే ఉంటుందన్నట్టుగా విమర్శలు రువ్వుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఆ ప్రాంతానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేస్తూ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు.. రేవంత్ కేబినెట్ లో ముసలం పుట్టించాలని చూస్తున్నాయా? అనే అనుమానం కలుగుతోంది.

కరీంనగర్లో పొన్నం- బండి మధ్య మాటల యుద్ధం కొంత కాలంగా నడుస్తోంది. తాజాగా.. ‘కరీంనగర్ స్థానం నుంచి ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. హిందుత్వం, ధర్మం, పార్టీ గురించి ఇక ఎన్నటికీ మాట్లాడబోనని’ బండి సంజయ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అదే సమయంలో, కాంగ్రెస్ గనుక ఓడిపోతే.. పొన్నం ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని ఆయన సవాలు విసిరారు. తమ మీద పొన్నం ప్రభాకర్ రాళ్ల దాడి చేయిస్తున్నారని, తన ప్రజాహిత యాత్ర హుస్నాబాద్ రాకుండా అడ్డుకోవాలని సిద్ధిపేట పోలీసులను పొన్నం ఆదేశించారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.

ఈ సవాళ్లు ఆరోపణలు విమర్శల వరకు ఓకే! కానీ.. వాటికి ముడిపెడుతున్న ఇతర విషయాలే తమాషాగా ఉంటున్నాయి. తన యాత్ర మీద రాళ్ల దాడి చేయించడం ద్వారా శాంతి భద్రతల సమస్య సృష్టించాలని పొన్నం ప్రభాకర్ చూస్తున్నట్టుగా బండి సంజయ్ అభివర్ణిస్తున్నారు. అలాంటి శాంతి భద్రతల సమస్య సృష్టించడం వలన.. దానిని రేవంత్ రెడ్డి వైఫల్యం కింద చూపించి.. ఆయనను ముఖ్యమంత్రి పదవిలోంచి తప్పించాలనేది పొన్నం కుట్ర అంటూ తనదైన భాష్యం చెబుతున్నారు.

అంటే.. ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ ను దించేయడానికి పొన్నం ప్రభాకర్ కుట్రలు చేస్తున్నట్టుగా బండి సంజయ్ మాటలు ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారంటూ.. అది రుజువులాగా ఆయన మాట్లాడుతున్నారు. పీసీసీ చీఫ్ సమయంలో వ్యతిరేకించిన సంగతి ఎలా ఉన్నా.. రేవంత్ కేబినెట్ ఏర్పడిన తర్వాత.. పొన్నం ప్రభాకర్ సీఎం పట్ల తన విధేయతను చాటుకుంటూనే ఉన్నారు.

అయితే బండి సంజయ్ తన మాటలద్వారా.. రేవంత్ కేబినెట్ లో అనుమానాలు సృష్టించాలని, ముసలం పుట్టించాలని చూస్తున్నట్టుగా ఉంది. ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలనుకుంటున్న ఈ ప్రయత్నంలో ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?