Advertisement

Advertisement


Home > Politics - Telangana

కిందా పైనా కోసేస్తున్నారు.. నడుమ ఎప్పుడో మరి?

కిందా పైనా కోసేస్తున్నారు.. నడుమ ఎప్పుడో మరి?

ప్రస్తుత రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే.. నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి పార్టీని బలహీన పరచడం మీద, వారి పార్టీ తరఫున గెలిచిన వారిని తమలో కలిపేసుకోవడం మీద దృష్టి సారించడం అనేది ఒక సాధారణ ప్రాక్టీస్ గా మారిపోయింది.

ఏ పార్టీ అయినా ఇదే తీరు. గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక తడవ తెలుగుదేశాన్ని ఖాళీ చేసి ఎమ్మెల్యేలను అందరినీ తమ పార్టీలో కలిపేసుకున్నారు. రెండు సారి ఏకంగా కాంగ్రెసు నుంచి 12 మందిని ఫిరాయింపజేసి తన పార్టీలోకి చేర్చుకున్నారు.

గతంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే.. ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫిరాయింపులు ఇష్టం లేక చాలా కాలం సంయమనం పాటించినా.. వారి వారి ఒత్తిడి మేరకు నలుగురు అటునుంచి ఈ పార్టీ నీడలోకి మారారు.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పటిదాకా వారు ఫిరాయింపులకు తెరతీయలేదు. ఇప్పుడిప్పుడే షురూ అవుతున్నట్లుగా ఉంది. వారి తీరు చూస్తే.. గులాబీ దళాన్ని కిందా పైనా కోసేయడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. నడుమ కోతలకు ఎప్పుడు ముహూర్తమో తెలియడం లేదు.

కింద అంటే- స్థానిక సంస్థలు! కాంగ్రెస్ గెలిచిన నాటినుంచి ఇప్పటికే పలు మునిసిపాలిటీలు భారాస నుంచి కాంగ్రెస్ వశం అయ్యాయి. ఒకవైపు ఫిరాయింపుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం తమకు లేనేలేదని సీఎం రేవంత్ అంటూ ఉంటారు. అదే సమయంలో ఆయన మంత్రివర్గ సహచరులు మాత్రం పార్లమెంటు ఎన్నికల తర్వాత భారాస ఖాళీ అవుతుందని జోస్యం చెబుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో కింద మునిసిపాలిటీలు అయిపోయిన తర్వాత.. ఇప్పుడు పైన కోతలు- అంటే భారాస ఎంపీలను తమలో చేర్చుకోవడం కాంగ్రెస్ ప్రారంభించినట్టు కనిపిస్తోంది.

భారాసకు చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత తాజాగా ఢిల్లీలో కాంగ్రెసులో చేరారు. పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ ఫిరాయింపు కీలకమైనది. ఇప్పుడిక ఆయన మీద ఫిరాయింపు చట్టం కింద వేటు వేయించడానికి కూడా భారాస పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

కిందా పైనా అయిపోయిన తర్వాత ‘నడుమ కోతలు’- అంటే.. ఎమ్మెల్యేల ఫిరాయింపులను కాంగ్రెస్ ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వారికి టచ్ లోనే ఉన్నారు. రేవంత్ ను కలిసిన గులాబీ ఎమ్మెల్యేలు అందరిమీద ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. బహిరంగంగా కలవకుండా లోలోపల మంతనాలు సాగించిన వారు ఇంకా ఉన్నారని అనుకుంటున్నారు. మరి ఈ ఎమ్మెల్యేల కోతలు అనబడు ఫిరాయింపులు పార్లమెంటు ఎన్నికలకు ముందే ఉంటాయా? తర్వాత ఉంటాయా? అనేది వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?