Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ముహూర్తం ఫిక్స్!

ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ముహూర్తం ఫిక్స్!

కిందిస్థాయిలో మునిసిపాలిటీలు, జడ్పీలు కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం అనే పర్వం పూర్తయింది. తెలంగాణలో చాలావరకు మునిసిపాలిటీలో.. గతంలో భారాస చేతిలో ఉన్నవి  కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.

ఎగువస్థాయిలో ఒక ఎంపీని కూడా వారు తమ జట్టులో చేర్చుకున్నారు. ఎంపీల కోసం ఇంకా వల విసురుతున్నప్పటికీ.. ఫలితం పెద్దగా లేదు. కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యాప్తి అవుతుండగా.. భారాసను వీడదలచుకున్న వారు కూడా బిజెపి వైపు చూస్తున్నారు తప్ప.. కాంగ్రెసు ను పట్టించుకోవడం లేదు.

ఇకపోతే ఇప్పుడు భారాస ఎమ్మెల్యేల వంతు వచ్చింది. గులాబీ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తమ జట్టుతో కలుపుకునే ప్రయత్నాలను రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల తర్వాత చేస్తారా? అంతకంటె ముందేనా? అనే ఒక్క విషయంలోనే సందేహాలు ఉండేవి. అయితే అందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

తొలిచేరిక ఖమ్మం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దే అవుతుందని చర్చ నడుస్తోంది. ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విశ్వసనీయమైన అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావు.. ఆయన వెంటే ఉంటూ కాంగ్రెసులోకి వచ్చారు. అక్కడ తాను కోరిన భద్రాచలం టికెట్ కు గ్యారంటీ దొరక్కపోవడంతో, అప్పటికప్పుడు మళ్లీ గులాబీతీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి డోలాయమానంగా ఉన్న వెంకట్రావు కొన్ని రోజుల కిందట కుటుంబసభ్యులతో కలిసి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తాజాగా ఆయన కాంగ్రెసులో చేరడానికి ఈనెల 11న ముహూర్తం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. బూర్గంపాడులో జరిగే రేవంత్ రెడ్డి సభలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి తాజాగా నిర్వహించిన సన్నాహక సమావేశానికి కూడా వెంకట్రావు గైర్హాజరు కావడం విశేషం.

నిజానికి ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. స్వయంగా వెళ్లి ఆయనను కలిసిన వారే అనేకులు ఉన్నారు. ఇంకా బయటపడకుండా టచ్ లో ఉన్నవారు కూడా చాలామందే. గతంలో కాంగ్రెస్ నుంచి 12 మందిని ఫిరాయింపజేసి తమ జట్టులో కలుపుకుని, కాంగ్రెసును బలహీనపరిచేందుకు కేసీఆర్ పావులు కదిపిన నేపథ్యంలోకనీసం 15 కు తక్కువ కాకుండా భారాస ఎమ్మెల్యేలను కాంగ్రెసులో కలిపేసుకునేలా రేవంత్ వ్యూహం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫిరాయింపుల యజ్ఞానికి 11వ తేదీన తెల్లం వెంట్రావు చేరిక శ్రీకారం కానుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?