Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఉద్యోగులను బుట్టలో వేయడం కోసమేనా?

ఉద్యోగులను బుట్టలో వేయడం కోసమేనా?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క సాగిస్తున్న పాదయాత్ర ఎనిమిది వందల కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భంగా వారు ఒక గొప్ప భారీ బహిరంగ సభను నిర్వహించారు సహజంగానే ఈ బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి మీద, కేసీఆర్ మీద, బిజెపి మీద కాంగ్రెస్ నాయకులు ఎడాపెడా విమర్శలు కురిపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఉద్యోగులను ఆకట్టుకోవడానికి ఆ పార్టీ నాయకుడు విసిరిన వల మరొక ఎత్తు!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనుక వెంటనే తిరిగి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు తెలంగాణ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. నిజానికి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడం అనేది ఒక పెద్ద తేనె తుట్టెను కదిలించడం లాంటి వ్యవహారం!

ఓ పి ఎస్ అనగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తిరిగి తీసుకురావడం అంటే ఏ ప్రభుత్వమైనా సరే అపరిమితమైన ఆర్థిక భారాన్ని నెత్తికెత్తుకుంటున్నట్టు లెక్క. కానీ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఓపీఎస్ హామీ ఇచ్చి.. తాము అధికారంలోకి రాగానే ఆ పని చేసి చూపించింది. అక్కడ చేసినంత మాత్రాన కాంగ్రెస్ ప్రతిరాష్ట్రంలోనూ ఇలాంటి పని చేయగలదని అనుకుంటే భ్రమ. 

తెలంగాణ, ఏపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉండే చోట ఓపీఎస్ అమల్లోకి తెస్తే ప్రభుత్వం మెడకు గుదిబండ తగిలించుకున్నట్టే. కానీ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ మాత్రం.. ముందు వెనుక చూసుకోకుండా తెలంగాణ లో జరిగిన పార్టీ సభలో ఓపీఎస్ హామీ ఇచ్చేశారు.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే తరహాలో ఆవేశంగా ఓపీఎస్ హామీ ఇచ్చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడుతున్న ఇబ్బందులు చూసి కూడా.. మరొకరు అలాంటి హామీ ఇవ్వడం సాహసం అనే చెప్పాలి. లేదా, అలాంటి హామీ ఆత్మహత్యా సదృశం అవుతుందని తెలిసే.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, స్వయంగా తాము ఆ మాట చెప్పకుండా.. హిమాచల్ నుంచి వచ్చిన సుఖ్వీందర్ తో చెప్పించి, ఉద్యోగులను బుట్టలో వేయడానికి తాయిలం చూపిస్తున్నారా అని కూడా అనిపిస్తోంది.

ఉద్యోగులను బుట్టలో వేసుకోవడానికి ఓపీఎస్ అనేది కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాస్త్రంగా పరిగణిస్తున్నదా అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే తెలంగాణ ఉద్యోగవర్గాల్లో కేసీఆర్ సర్కారు పట్ల అసంతృప్తులు ఉన్నాయి. పీఆర్సీ విషయంలో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఉద్యోగుల్లోని అసంతృప్తిని మరింత రాజేసీ తమవైపు తిప్పుకోవడానికి ఓపీఎస్ హామీ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అనుకుంటున్నట్టు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?