Advertisement

Advertisement


Home > Politics - Telangana

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ‘హస్తం’ పార్టీ హవా

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో  ‘హస్తం’ పార్టీ హవా

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుత అధికార కాంగ్రెస్ తో పాటు, బీఆర్ఎస్, బీజేపీలు ఈసారి లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. దేశంలో మూడోసారి అధికారంలోకి రావడానికి  రాష్ట్రంలో అత్యధిక సీట్లు సంపాదించడం అవసరమని భావిస్తున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్, ఈ లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలను సాధించి రాహుల్ గాంధీకి బహుమానంగా ఇవ్వాలని కంకణం కట్టుకుంది. మరోవైపు బీఆర్ఎస్ తన గత ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, అత్యధిక స్థానాలు సంపాదించాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయి? ఏ పార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అన్న దానిపైన జోరుగానే సర్వేలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తెలంగాణ ట్రాకర్ పోల్ అనే సంస్థ సర్వే నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సంస్థ మొత్తం రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు గాను 12 స్థానాలలో సర్వే నిర్వహించింది. ఈ 12 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారని మొత్తం ఓట్ల శాతంలో కాంగ్రెస్ పార్టీకి 46 శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నారని పేర్కొంది. అంటే రాష్ట్రంలో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండబోతుందని వెల్లడించింది. ఇక రెండవ స్థానంలో  బీజేపీ నిలుస్తుందని, ఆ పార్టీకి 30 శాతం ఓట్లు వస్తాయని సర్వే ఫలితాలలో తేలిందని పేర్కొంది.

ఇక పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడవ స్థానానికి పరిమితమవుతుందని, ఈసారి 22 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే వెల్లడించింది. కేసీఆర్​ పని గోవిందా అని తాజా సర్వే తేల్చింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు జీవనర్మణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, మరోవైపు పార్టీ నుంచి వలసలు పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీ బతికి బట్టకట్టాలంటే ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లను దక్కించుకోవడమే బీఆర్ఎస్ కు సవాల్ గా మారుతోంది. దీంతో బీఆర్ఎస్ కూడా చావో రేవో అన్నట్లుగా కొట్లాడేందుకు రెడీ అవుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సర్వే చెబుతోంది. అది కూడా కేసీఆర్ సొంత జిల్లా మెదక్ మాత్రమే. అందులోనూ కేసీఆర్ లేదా హరీశ్ రావు నిబడితేనే గెలుపు సాధ్యమట. అలా కాకుండా వేరే ఎవరికైనా ఇస్తే అక్కడా కాంగ్రెస్ గెలుస్తుందన్నది సర్వేలో వెల్లడైన మరో కీలక విషయం. అందరూ అనుకున్నట్లే ఈసారి కూడా లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించబోతోందని  తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 10 సీట్లు అలాగే ఎమ్ఐ ఎమ్ కి ఒక సీటు, బీఆర్ఎస్, బీజేపీకి  చేరో మూడు సీట్లు రాబోతున్నట్టు టైమ్స్ నౌ సంస్థ చేసిన సర్వేలో తేలిపోయింది.

అయితే లోక్ సభ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ సర్వే ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎన్నికలు జరిగే సమయం వరకు బీజేపీ నాయకుల పనితీరు, అలాగే బీఆర్ఎస్ నాయకుల పనితీరు కూడా ప్రజలు చూస్తారు. అంతేకాకుండా కాంగ్రెస్ తన ముందున్న అన్ని పనులను, అలాగే వాళ్ళు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విజయవంతంగా కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది. 

కాంగ్రెసులో  ఉన్న ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచి వారి ఎంపీ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రస్తుతం పార్టీలో  ఉన్న ఎంపీలు జీరో అని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పరిపాలన బాగుంటే కచ్చితంగా 8 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తారని  రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 64 చోట్ల కాంగ్రెస్, ఒక సెగ్మెంట్ లో ఆ పార్టీ మిత్రపక్షమైన సీపీఐ విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు.. రేవంత్ రెడ్డి నేతృత్వంలో  ప్రజల పాలన మొదలవటం, ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టడం, సెక్రటేరియట్ లోకి అందరికీ ప్రవేశం కల్పించడం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించడం, ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ గత ప్రభుత్వ అవినీతిని విడమర్చి చెబుతుండటం కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తోంది. 

దీనికి తోడు స్థానిక సంస్థలు కూడా అవిశ్వాస తీర్మానాలతో అధికార పార్టీ వశమవుతుండటం హస్తం పార్టీకి ప్లస్ అవుతోంది. కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. అధికార  కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు లభిస్తాయన్నది సర్వేల  సారాంశం. లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెసుకే మొగ్గు ఉంటుందని ఇండియా టుడే -సీ వోటర్ సర్వే  గత ఏడాది ఆగస్టులోనే తెలిపింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ కు 7, బీఆర్ఎస్ కు 5, బీజేపీకి 4 సీట్లు దక్కుతాయని వివరించింది. ఎంఐఎం ఎప్పటిలాగే హైదరాబాద్ సీటును నిలుపుకొంటుందని స్పష్టం చేసింది. 

పీపుల్స్ పల్స్ – సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ సంస్థ సర్వే ప్రకారం తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ 10 గెలుచుకుంటుంది. గత ఎన్నికల్లో 9 స్థానాలు గెలుచుకున్న భారత రాష్ట్ర సమితికి ఈసారి మూడు నుంచి 5 మాత్రమే దక్కనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రెండు నుంచి నాలుగు స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.

హైదరాబాద్ సీటు ఎప్పటిలానే ఎంఐఎం ఖాతాలోకి వెళుతుందని చెప్పింది. కేంద్రంలో మోడీ సర్కారు ఉండాలనే భావన తెలంగాణలో కూడా గట్టిగా ఉందని, బీఆర్ఎస్ కు మాత్రం ఎటువంటి ట్యాగ్ లైన్ కనపడటంలేదని సౌత్‌ ఫస్ట్‌ ట్రాకర్‌ పోల్‌ అభిప్రాయపడింది. మొత్తం మీద తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఆధిక్యత ప్రదర్శిస్తుందని దాదాపు సర్వేలన్నీ చెబుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?