Advertisement

Advertisement


Home > Politics - Telangana

పైకి ఖాకీ.. లోపల మొత్తం నకిలీ

పైకి ఖాకీ.. లోపల మొత్తం నకిలీ

ఉద్యోగం ఇప్పిస్తామంటే ఏ నిరుద్యోగికైనా ఆశ పడుతుంది. అదే ప్రభుత్వ ఉద్యోగమైతే ఆ ఆశ రెట్టింపు అవుతుంది. ఆ ఆశనే తన పెట్టుబడిగా మార్చుకున్నాడు మోసగాడు హనుమంత రమేష్. ప్రియురాలితో కలిసి ఏకంగా 30 మందిని బురిడీ కొట్టించి, 3 కోట్ల రూపాయలు ఎగరేసుకుపోయాడు.

ఒకప్పుడు సీఆర్పీఎఫ్ లో పనిచేశాడు రమేష్. కొన్నాళ్లకు అక్కడ సస్పెండ్ అయ్యాడు. అప్పట్నుంచి మోసాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఓసారి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినప్పటికీ అతడి బుద్ధి మారలేదు.

ఈసారి ఏకంగా పోలీస్ గెటప్ వేశాడు. తను పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేస్తున్నానని, డబ్బులిస్తే పోలీస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అలా దాదాపు 30 మంది నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేశాడు. ఇతడికి ప్రియురాలు ప్రవీణ కూడా సాయం చేసింది. ఇద్దరూ కలిసి పోలీస్ యూనిఫాం ధరించి, పలుమార్లు బాధితులతో నేరుగా సంప్రదింపులు జరిపారు.

అయితే ఎప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో ఓ యువతికి అనుమానం వచ్చింది. వెంటనే పెందుర్తి పీఎస్ లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు, అప్పటికే రమేష్, తన ప్రియురాలితో విశాఖ వదిలి పారిపోయినట్టు గుర్తించారు. సాంకేతికత సహాయంతో కూపీ లాగగా హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు గుర్తించారు. వెంటనే వెళ్లి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆల్రెడీ హనుమంతు రమేష్ కు పెళ్లయింది. ఒకటి కాదు, 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వరసకు అక్కాచెల్లెళ్లయిన ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని కాపురాలు పెట్టాడు. అది చాలదన్నట్టు మరో అమ్మాయి ప్రవీణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రేయసితో కలిసి ఈ కొత్త మోసానికి తెరదీశాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?