Advertisement

Advertisement


Home > Politics - Telangana

సుజ‌నాకు బీఆర్ఎస్ విస్తృత ప్ర‌చారం

సుజ‌నాకు బీఆర్ఎస్ విస్తృత ప్ర‌చారం

బీజేపీ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రితో పాటు మ‌రికొంద‌రు నాయ‌కుల‌కు బీఆర్ఎస్ హైద‌రాబాద్‌లో విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఇవాళ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఈడీ విచారిస్తున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో కొంత మంది ప్ర‌త్య‌ర్థుల ఫొటోలతో పోస్ట‌ర్లు, ప్లెక్సీలు పెట్టి మ‌రీ ప్ర‌చారానికి దిగ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం.

బీజేపీలో చేరితే ఎలాంటి నాయ‌కులైనా పునీత‌ల‌వుతార‌ని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున బీజేపీపై ఎదురు దాడికి దిగింది. సీబీఐ, ఈడీ, ఐటీల‌ను చేతిలో పెట్టుకుని ప్ర‌త్య‌ర్థుల‌పై కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ బ్లాక్ మెయిల్‌కు పాల్ప‌డుతోంద‌ని బీఆర్ఎస్ నేత‌లు కొంత కాలంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో బీజేపీ వ్య‌వ‌హార‌శైలిపై విరుచుకుప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీలో చేర‌డానికి ముందు, ఆ త‌ర్వాత ఎవ‌రెవ‌రిపై సీబీఐ, ఈడీ దాడులు ఆగిపోయాయో పేర్ల‌తో సహా మంత్రి కేటీఆర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న విమర్శ‌ల‌కు పోస్ట‌ర్లు, ప్లెక్సీల రూపంలో ఓ రూపం సంత‌రించుకుంది. వీరిలో మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, బీజేపీ సీనియ‌ర్ నేత సుజ‌నా చౌద‌రి ఫొటో ఉండ‌డం ఆస‌క్తి క‌లిగించే అంశం.

బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నాయకుల ఫొటోలతో హైద‌రాబాద్‌లో నగర వ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. ఈడీ, సీబీఐ రైడ్స్‌ ముందు, తర్వాత ఎమ్మెల్సీ కవితలో ఎలాంటి మార్పు రాలేద‌ని,  అసలైన రంగులు వెలసిపోవంటూ కేసీఆర్ కుమార్తెకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ , కేంద్ర మాజీ మంత్రి నారాయణ్‌ రాణే, పశ్చిమబెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి, ఏపీ వ్యాపారవేత్త సుజనా చౌదరి...  ఐటీ, సీబీఐ రైడ్స్‌కు ముందు, తర్వాత రంగు మారినట్లు జ‌నానికి చూపే ప్ర‌య‌త్నం ఆక‌ట్టుకుంటోంది. చివర్లో బైబై మోదీ అంటూ హ్యాష్‌ టాగ్‌తో పోస్టర్లను అంటించడం గ‌మ‌నార్హం. వీరిలో సుజ‌నాచౌద‌రి మ‌న తెలుగు నాయ‌కుడు కావ‌డంతో అంద‌రికీ సుప‌రిచితుడ‌నే భావ‌న. 

సుజ‌నాకు బీఆర్ఎస్ విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తోంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే మోదీని రాక్ష‌సుడిగా చూపుతున్న క‌టౌట్లు న‌గ‌రంలో విస్తృతంగా క‌నిపిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?