చాలా రోజుల తర్వాత జనసేనాని పవన్‌కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. ఏపీలో ఆయన అడుగు పెడితే అదో బ్రేకింగ్ న్యూస్ అవుతోందంటే…ఆ రాష్ట్రంతో పవన్‌కు అనుబంధం ఏంటో అర్థం చేసుకోవచ్చు. జనసేన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం జనసేన కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహణ. చెప్పిన సమయం ప్రకారం బీసీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని మొదలు పెట్టారు.
అయితే తమ గోడు వింటారని సుదూరాల నుంచి వచ్చిన బీసీలకు అక్కడి పరిస్థితి తీవ్ర నిరాశను కలిగించింది. సమావేశానికి పవన్‌కల్యాణ్ హాజరు కాకపోవడంతో బీసీలంతా నిరుత్సాహానికి లోనయ్యారు. పవన్‌కు కేటాయించిన కుర్చీ ఖాళీగా కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీసీల నేతలు మాట్లాడుతుంటే జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ నోట్ చేసుకోవడం కనిపించింది.
కనీసం బీసీల సమస్యల వినే ఓపిక లేని నాయకుడు, తమ సంక్షేమం కోసం ఏ విధంగా పని చేస్తారనే చర్చ ఆ సమావేశానికి వచ్చిన నేతల మధ్య సాగింది. కేవలం తాను మాట్లాడ్డానికే తప్ప, వినడానికి బీసీల సదస్సు నిర్వహించడం లేదనే సంకేతాల్సి పవన్ పంపారని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇంకా వస్తాడు, వస్తాడు అని ఎదురు చూస్తూ గంటన్నర సమయం పైగా ఎదురు చూసినా ఆయన మాత్రం కనిపించలేదని బీసీల నేతలు వాపోయారు.
తమ సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ధి వున్న నాయకులెవరూ ఇలా చేయరనే కామెంట్స్ బీసీల నుంచి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రెండునెలలకో, మూడు నెలలకో సమావేశం నిర్వహించే పవన్‌కల్యాణ్‌కు , తాను రప్పించుకున్న వారి సమస్యలను కూడా వినేందుకు తీరిక లేనంత బిజీ ఏముంటుందనే నిలదీతలు ఎదురవుతున్నాయి.