ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అక్కడ ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడిపేస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పలు హాలీవుడ్ సంస్థల్లో నటించబోతున్నారనే ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. రాజమౌళికి కూడా అలాంటి బంపర్ ఆఫర్ తగిలిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వెబ్ సైట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
అవకాశం వస్తే మార్వెల్ స్టూడియోస్ లేదా స్టార్ వార్స్ ఫ్రాంచేజీలో దేన్ని ఎంపిక చేసుకుంటారంటూ రామ్ చరణ్ ని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానమిచ్చారు. జనం మెచ్చి, టికెట్ కొని చూసేందుకు ఆసక్తి చూపించే ఏ ఫ్రాంచైజీ సినిమాలో అయినా తాను నటిస్తానన్నారు చరణ్. ప్రతి దేశంలో, ప్రతి సినిమాలో తనకు నటించాలని ఉందని తెలిపారు. తనకు అది, ఇది అనే తేడా లేదని, ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్.. అన్నీ పోయి ఒకే ఒక్క గ్లోబల్ సినిమా మిగిలిందని చెప్పుకొచ్చాడు.
పెద్ద పార్టీ ఇస్తా..
రాజమౌళికి మార్వెల్ ఫిలిమ్స్ సంస్థలో దర్శకత్వం చేసే అవకాశం వస్తే తాను అందరికంటే ఎక్కువ సంతోషిస్తానన్నాడు రామ్ చరణ్. అప్పుడో ఓ పెద్ద పార్టీ ఇస్తానని కూడా చెప్పారు. రాజమౌళి టాలెంట్ ని ప్రపంచ సినిమా రంగం గుర్తించిందని చెప్పుకొచ్చాడు.
చిరంజీవికి సెంటిమెంట్ ఎక్కువ..
తన తండ్రి చిరంజీవి 42 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నారని, 154 సినిమాలు చేశారని, అప్పట్లో ఆయన ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చారని, అప్పుడప్పుడూ ఆ విషయాన్ని గుర్తు చేసుకునేవారని, ఇప్పుడు ఆయన కొడుకు సినిమా ఆస్కార్స్ కి ఎంపికైనందుకు చాలా గర్వపడుతున్నారని చెప్పాడు చరణ్. తాను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఆయన ఎంతో ఎమోషనల్ అయ్యారని గుర్తు చేశాడు.