Advertisement

Advertisement


Home > Politics - Telangana

హనీ ట్రాప్.. ఆమె కోసమే పేపర్ లీక్

హనీ ట్రాప్.. ఆమె కోసమే పేపర్ లీక్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంస్థకు చెందిన కీలకమైన కంప్యూటర్ హ్యాకింగ్ కు గురైందని, అందుకే పరీక్షను వాయిదావేశామని అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరీక్ష పత్రం లీక్ వెనక జరిగింది హ్యాకింగ్ కాదు, హనీ ట్రాప్.

అవును.. ఓ అమ్మాయి మత్తులో పడి స్వయంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగి ఈ పరీక్ష పత్రాన్ని లీక్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు, సదరు ఉద్యోగితో పాటు, మరో ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగింది..

లెక్కప్రకారం, ఈరోజు టౌన్ ప్లానింగ్ పోస్టుల భర్తీకి పరీక్ష జరగాల్సి ఉంది. ఓఎంఆర్ పద్ధతిలో రాతపరీక్ష నిర్వహించేందుకు ప్రశ్నాపత్రం సిద్ధంచేసి ఉంచింది టీఎస్పీఎస్సీ. అయితే ఆఖరి నిమిషంలో కంప్యూటర్ నుంచి సమాచారం బయటకెళ్లినట్టు గుర్తించారు. దీంతో వెంటనే టౌన్ ప్లానింగ్ తో పాటు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు చెందిన రాతపరీక్షల్ని వాయిదా వేశారు, అంతకంటే ముందు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ వద్ద పీఏగా చేస్తున్న ప్రవీణ్ ఈ పని చేసినట్టు గుర్తించారు. కొన్ని రోజులుగా ఓ యువతి, అతడితో చనువుగా ఉంటోంది. ప్రవీణ్ ను కలిసేందుకు పలుమార్లు కార్యాలయానికి కూడా వచ్చింది.

ఆమె కోరిక మేరకు, ప్రశ్నాపత్రాన్ని బయటకు తీసుకొచ్చాడు ప్రవీణ్. అలా హనీ ట్రాప్ మూలంగా ఈ పరీక్ష పత్రం లీక్ అయింది. వేలాది మంది మంది అభ్యర్థుల జీవితాల్ని ప్రశ్నార్థకం చేసింది.

అయితే అత్యంత కట్టుదిట్టమైన పాస్ వర్డ్స్ తో ఉండే ఆ కంప్యూటర్ ను ప్రవీణ్ ఎలా తెరిచాడనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఆ పాస్ వర్డ్స్ అతడికి ఎలా తెలిశాయి, కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రశ్నాపత్రాన్ని అతడు ఎలా ప్రింట్ చేశాడు (ప్రింట్ ఆప్షన్ లేదు) అనేది పోలీసులు కనిబెట్టాల్సి ఉంది. దీంతో పాటు, లీక్ చేసిన క్వశ్చన్ పేపర్ ను అతడు ఎంతమందికి అందించాడనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రస్తుతానికి ఈ కేసులో ప్రవీణ్ తో పాటు మరో ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హ్యాకింగ్ అనుకుంటే, హనీ ట్రాప్ గా మారిన ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?