Advertisement

Advertisement


Home > Politics - Telangana

సర్దిచెప్పడం గులాబీ పెద్దలకు చేతకాలేదా?

సర్దిచెప్పడం గులాబీ పెద్దలకు చేతకాలేదా?

ఒకప్పట్లో గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మాట చెప్పారంటే.. పార్టీ మొత్తానికి అది వేదం. శిరోధార్యం. ఆయన మాటకు ఎదురుచెప్పగల మొనగాడు పార్టీలో ఎవ్వరూ లేరు. ఉంటే మనలేరు. పరిస్థితి అలా ఉండేది. కానీ.. కేవలం ఒక్కటంటే ఒక్క ఓటమి ఎదురుపడగానే సీను మొత్తం రివర్సు అయినట్టుగా కనిపిస్తోంది.

పార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకున్న తరువాత.. నలుగురిలో నవ్వులపాలు అవుతాం అని తెలిసినా.. దానిని పార్టీ శ్రేణులు, నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇది మరీ అంత పెద్ద పరిణామం కాదు. కానీ.. అలాంటి ధిక్కార స్వరాలు వినిపిస్తున్న నాయకులకు కనీసం సర్దిచెప్పలేని, బుజ్జగించలేని దీనస్థితిలో గులాబీ పెద్దలు, అధినాయకత్వం ఉన్నారు.

భారాసలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంతో కీలకమైన నాయకుడు అనడంలో సందేహం లేదు. కేసీఆర్ కు సహచరుడు, సమకాలీనుడు అయిన ఆయన నల్గొండ జిల్లాకు చెందిన నాయకుడు. తన కొడుకు గుత్తా అమిత్‌రెడ్డితో రాజకీయ అరంగేట్రం చేయించాలని ఆయన తలపోశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే బరిలోకి దించాలని అనుకోగా.. వివిధ సమీకరణాల వల్ల, మెజారిటీ టికెట్లు సిటింగులకే కట్టబెట్టడం వల్ల సాధ్యం కాలేదు.

అయితే.. కొడుకును ఎంపీగా పోటీచేయించడానికైనా ఆయన సిద్ధంగానే ఉన్నారు. ఇటీవల హరీష్ రావు, కేటీఆర్ కలిసి గుత్తా అమిత్ రెడ్డితో చర్చించి.. నల్గొండ సీటు నుంచి పోటీచేసేలా ఒప్పించినట్టు వార్తలు వచ్చాయి. గుత్తా తండ్రీ కొడుకులు కూడా అందుకు ఒప్పుకున్నారు. అయితే ఇంతలోనే పరిస్థితి మారిపోయింది. నల్గొండ ఎంపీగా అభ్యర్థిత్వం పోటీనుంచి తప్పుకుంటున్నట్టు గుత్తా అమిత్ ప్రకటించేశారు.

విషయం ఏంటంటే.. నల్గొండకే చెందిన కొందరు భారాస నాయకులు గుత్తా ఫ్యామిలీలో టికెట్ ఇవ్వరాదని నిరాకరించారట. గుత్తా అమిత్ కు టికెట్ ఇస్తే.. ఆయన విజయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని తెగేసి చెప్పారట. దాంతో అమిత్ అలిగి తప్పుకున్నట్టు సమాచారం. ఈ అలక ఆయనను కాంగ్రెస్ వైపు నడిపించినా కూడా ఆశ్చర్యం లేదు.

అయితే ఇక్కడ సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. గుత్తా కుటుంబం పార్టీకి అవసరం అనుకున్న తరువాత.. వారిని ధిక్కరించిన నాయకులకు గులాబీ పెద్దలు సర్దిచెప్పడంలో విఫలం అయ్యారా? బాస్ ఏం చెబితే దానికి తలాడించే నాయకులకు, పార్టీ ఓడిపోయిన తర్వాత కొమ్ములు మొలిచాయా? గులాబీ పెద్దల ప్రాభవం ప్రజల దృష్టిలో మాత్రమే కాదు, పార్టీ నాయకుల దృష్టిలో కూడా తగ్గిపోతోందా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?