Advertisement

Advertisement


Home > Politics - Telangana

గులాబీల ఆగ్రహం.. అర్థంలేని అరణ్యరోదన!

గులాబీల ఆగ్రహం.. అర్థంలేని అరణ్యరోదన!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎట్టకేలకు గులాబీ తనయ కవిత అరెస్టు కూడా జరిగింది. ప్రస్తుతం ఆమె ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కవితను అరెస్టు చేసిన నాటినుంచి భారాస పార్టీ శ్రేణులు ఈడీ తీరు మీద మండిపడుతున్నాయి.

కేంద్రప్రభుత్వాన్ని కూడా అదేపనిగా విమర్శిస్తున్నాయి. అసలు అరెస్టు అక్రమం అంటున్నాయి. సుప్రీం కోర్టులో కవిత వేసిన పిటిషన్ ఇంకా తుదితీర్పు రాకపోగా, అసలు ఎలా అరెస్టు చేస్తారంటూ.. అరెస్టు సందర్భంలోనే కేటీఆర్ తదితరులు ఈడీ అధికారులపై చిందులు తొక్కిన వైనం ప్రజలందరూ కూడా చూశారు. ఈ క్రమంలో కవిత అరెస్టు పూర్తిగా అక్రమం అని ఆరోపిస్తూ కవిత రౌజ్ అవెన్యూ కోర్టులోనే దాఖలు చేసిన ఒక పిటిషన్ వీగిపోయింది.

కవితను అరెస్టు చేయడంలో ఈడీ అధికారులు, అందుకు సంబంధించిన అన్ని నిబంధనలను పద్ధతిగా పాటించారంటూ కోర్టు ధ్రువీకరించింది. ఆమె అరెస్టు ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా జరగలేదని పేర్కొంది. అరెస్టు కారణాలను కూడా ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చారని, చట్ట ఉల్లంఘన ఎక్కడా లేదని, సాయంత్రం 5.20 గంటలకు సూర్యాస్తమయానికి ముందే ఆమెను అరెస్టు చేశారని, నిబంధనల ప్రకారం 24 గంటలకంటె ముందే కోర్టు ఎదుట హాజరుపరిచారని కోర్టు పేర్కొంది.

అరెస్టు చేసిన రోజు కూడా.. కేటీఆర్ తదితరులు, సీఆర్పీసీ 80, 81 సెక్షన్ల ప్రకారం ట్రాన్సిట్ రిమాండ్ లేకుండా ఎలా తీసుకువెళ్తారంటూ ఈడీ అధికారులమీద ఆగ్రహించారు. అయితే, సెక్షన్ 19 లోని నిబంధనల ప్రకారం అసలు అలాంటి అవసరం లేదని న్యాయమూర్తి తేల్చేశారు. ఈ తీర్పుతో కవిత పిటిషన్ పూర్తిగా వీగిపోయింది.

తన అరెస్టు ను సవాలు చేస్తూ కవిత సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. అది ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఈ పరిణామాలను అన్నింటినీ గమనిస్తున్న వారు మాత్రం.. గులాబీ తనయ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు.

ఢిల్లీలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు రూ.100 కోట్ల లంచాలు ముట్టజెప్పి, అక్కడ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందింపజేసుకున్న కేసులో కవిత కూడా కీలక నిందితురాలు. ఈ కేసులో ముందే అరెస్టు అయి అప్రూవర్ లుగా మారిన మాగుంట రాఘవ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తదితరులు వాంగ్మూలాల ఆధారంగానే తాజాగా కవిత అరెస్టు కూడా జరిగింది. ఆమె పాత్ర ఎంత మేరకు ఉందో నిగ్గుతేల్చే పనిలో ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?