Advertisement

Advertisement


Home > Politics - Telangana

క‌విత‌మ్మా...నీ వ‌ల్ల ప‌రువు పోయింద‌మ్మా!

క‌విత‌మ్మా...నీ వ‌ల్ల ప‌రువు పోయింద‌మ్మా!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఈడీ విచార‌ణ ఎదుర్కోనున్న నేప‌థ్యంలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ స‌ర్కార్‌ను టార్గెట్ చేస్తూ మంత్రి కేటీఆర్‌, ఆయ‌న చెల్లి క‌విత త‌మ‌దైన రీతిలో ఘాటు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వారికి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి దీటైన కౌంట‌ర్ ఇచ్చారు.

లిక్క‌ర్ స్కామ్‌కు పాల్ప‌డిన క‌విత చ‌ర్య‌ల‌తో తెలంగాణ స‌మాజం ప‌రువు పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బ‌హుశా లిక్క‌ర్ స్కామ్‌లో ఒక మ‌హిళా నాయ‌కురాలిగా క‌విత ఒక్క‌రే ఇరుక్కున్నార‌న్నారు. దేశంలోనే ఇది అవ‌మాన‌క‌ర‌మ‌న్నారు. లిక్క‌ర్ స్కామ్‌లో ఇరుక్కోవ‌డ‌మే కాకుండా తాను ఆడ‌పిల్ల‌న‌ని, తెలంగాణ బిడ్డ‌న‌ని క‌విత మాట్లాడ్డంపై కిష‌న్‌రెడ్డి అభ్యంత‌రం చెప్పారు. ఢిల్లీలో లిక్క‌ర్ వ్యాపారం చేయ‌మ‌ని తెలంగాణ ప్ర‌జ‌లు క‌విత‌ను కోరారా? అని ఆయ‌న నిల‌దీశారు. తెలంగాణ ప్ర‌జ‌లు సిగ్గుప‌డే ప‌ని క‌విత చేశార‌ని విరుచుకుప‌డ్డారు.

దేశంలో తెలంగాణ పరువు తీశారని ఆయ‌న  ధ్వజమెత్తారు. లిక్క‌ర్ స్కామ్‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే ఢిల్లీలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ కోసం దీక్ష పేరుతో స‌రికొత్త డ్రామాకు క‌విత తెర‌లేపార‌ని విమ‌ర్శించారు. అస‌లు మ‌హిళల రిజ‌ర్వేష‌న్ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి లేద‌న్నారు. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన మొద‌ట్లో క‌నీసం ఒక్క మ‌హిళ‌కు కేబినెట్‌లో చోటు ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు ను అడ్డుకున్నది ఎస్పీ, ఆర్జేడీ పార్టీలే అని ఆయ‌న అన్నారు. పార్ల‌మెంట్ రికార్డుల్లో చూస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంద‌న్నారు. ఆ పార్టీల‌తో అంటకాగుతున్న కేసీఆర్‌ ఈ విషయాన్ని ఎందుకు అడగడం లేద‌ని కిష‌న్‌రెడ్డి నిల‌దీశారు. రాజ్య‌స‌భ‌కు క‌నీసం ఒక్క మ‌హిళ‌ను కూడా పంప‌ని చ‌రిత్ర కేసీఆర్‌ది అని మండిప‌డ్డారు. 

అంతెందుకు బీఆర్ఎస్‌కు మిత్ర‌ప‌క్షమైన మ‌జ్లిస్ పార్టీని మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు అంగీక‌రింపచేస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏకాభిప్రాయం వస్తే త‌మ‌కు ఎలాంటి అభ్యంతరం లేద‌ని కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?