Advertisement

Advertisement


Home > Politics - Telangana

స్నేహాలు భారాసకు గుదిబండలు అవుతాయా?

స్నేహాలు భారాసకు గుదిబండలు అవుతాయా?

ఇంతకీ కెసిఆర్ లక్ష్యం ఏమిటి? భారత రాష్ట్ర సమితి అనే తన జాతీయ పార్టీని దేశమంతా విస్తరించాలని అనుకుంటున్నారా, లేదా, జాతీయ పార్టీ అనే హోదాని మాత్రం వాడుకుంటూ అన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నారా? అనే మీమాంస ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 

ఎందుకంటే, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలతో స్నేహ బంధాలు ముదిరే కొద్ది.. అవి పార్టీ విస్తరణకు, దేశవ్యాప్తంగా బలోపేతం కావడానికి ఆటంకంగా మారుతాయని, గుదిబండలు అవుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి అనుభవం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆల్రెడీ ఎదురైందని, అయినా సరే పాఠాలు నేర్చుకోకపోతే ముందు ముందు ఇబ్బంది తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత రాష్ట్ర సమితి అనే పేరు పెట్టక ముందు దేశంలోని అనేక రాష్ట్రాలు తిరిగి ఆయా రాష్ట్రాలలోని ముఖ్యమైన ప్రాంతీయ పార్టీల నాయకులతో కేసిఆర్ చర్చలు జరిపారు. అందరము కలిసి సమైక్యంగా మోడీ ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు పోరాడాలని ఆయన అప్పట్లో పిలుపు ఇచ్చారు. అయితే బిజెపి కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరం పాటిస్తూ మూడో కూటమి ఏర్పాటు చేయాలనేది ఆయన కోరిక. కాంగ్రెస్ లేని కూటమిలో ఉండడానికి కొందరికి ఇష్టం లేకపోగా, మూడో కూటమికి సారథ్యం వహించే పెద్దన్న బాధ్యతను కేసీఆర్ ఆశిస్తున్నారేమో అని కొందరు భయపడ్డారు! ఆయన ప్రయత్నాలకు పెద్దగా స్పందన రాలేదు. అన్ని రాష్ట్రాలు తిరిగి తిరిగి విసిగి వేసారి పోయిన కేసీఆర్ చివరికి తానే జాతీయ పార్టీ పెట్టేయాలని సంకల్పించారు. ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చి భారత రాష్ట్ర సమితి అని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేశారు. ఎర్రకోటపై గులాబీ జెండాని ఎగరేస్తామని కూడా ఆయన తొలుత ప్రకటించారు.

అయితే ఇప్పుడు తాను బలమైన నాయకుడిగా కనిపించడానికి ఇతర పార్టీలతో స్నేహబంధాలకు ఆయన ఎక్కువగా మొగ్గుతున్న వైఖరి కనిపిస్తోంది. ఆప్ ముఖ్యమంత్రులు ఇద్దరిని, సమాజ్ వాదీ మాజీ సీఎంను ఆహ్వానించే పోకడలు ఇందుకు నిదర్శనం. అయితే.. వీరితో స్నేహం కేంద్రంలో బలమైన జాతీయ కూటమిగా ఏర్పడడానికి ఆయనకు ఉపయోగపడుతుందనే మాట నిజమే. కానీ భారాస విస్తరించడానికి ఉపయోగపడుతుందా? అనేది సందేహం. 

తెలుగు రాష్ట్రాల రాజకీయాల జోలికి సమాజ్ వాది పార్టీ రాకపోవచ్చు. కానీ కేజ్రీవాల్ ఆగరు. కేసీఆర్ ప్రయత్నాలకంటె ముందునుంచి తెలంగాణలో పోటీచేయాలనే కోరిక ఆయనకు ఉంది. ఆప్ తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్ లోనో పోటీచేయాలనుకుంటే భారాస వారికోసం కొన్ని సీట్లు ఇవ్వవలసి రావొచ్చు. అదే సమయంలో ఢిల్లీ ఎన్నికల్లో భారాసకు సీట్లు ఇవ్వడానికి కేజ్రీ ఒప్పుకుంటారా? సందేహమే. 

ఆ రకంగా చూసినప్పుడు.. ఈ కొత్త స్నేహబంధాలు కూటమిగా బలపడడానికి ఉపయోగపడతాయి గానీ, భారాస విస్తరణకు బలోపేతానికి ఆటంకమే అని పలువురు విశ్లేషిస్తున్నారు. పొరుగున ఉన్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కూడా ఇలాంటి అనుభవమే కేసీఆర్ కు ఉన్నదని పుకార్లు కూడా వ్యాపిస్తున్నాయి. మరి భారాస ప్రస్థానం జాతీయ విస్తరణపథంలో ఎలా సాగుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?