Advertisement

Advertisement


Home > Politics - Telangana

కూతురు తప్పు చేసిందని ఆ తండ్రి నమ్ముతున్నాడా?

కూతురు తప్పు చేసిందని ఆ తండ్రి నమ్ముతున్నాడా?

కూతురు తప్పు చేసిందని ఆ తండ్రి నమ్ముతున్నట్లే కనబడుతోంది. ఆ తండ్రి పేరు కేసీఆర్. ఆ కూతురు కవిత. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమె తీహార్ జైలుకు వెళ్లి ఈ రోజుకు నెల రోజులైంది. అన్న కేటీఆర్ చెల్లెలును కలుసుకుంటున్నాడుగానీ తండ్రి కేసీఆర్ ఇప్పటివరకు కూతురును కలవలేదు. కూతురు జైలుకు వెళ్లిందనే బాధ మనసులో ఉండొచ్చు. తండ్రి కదా ... లేకుండా ఎలా ఉంటుంది ? మామూలు తండ్రి అయితే ఈపాటికి కిందా మీద అయ్యవాడు.

తెర వెనుక ఏం చేస్తున్నాడో మనకు తెలియదుగానీ పైకి కనబడే దృశ్యం మాత్రం కేసీఆర్ కూతురు కవితను కలవకుండా ఉండటమే. కవితకు కేసీఆర్ తండ్రి మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడు కూడా. తెలంగాణ సాధకుడిగా పేరు తెచ్చుకున్నాడు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే పరిస్థితి ఎలా ఉండేదోగానీ ఓడిపోవడమే కాకుండా ఓటమి తరువాత పార్టీ కకావికలై పోయింది. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది.

సరిగ్గా ఈ సమయంలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. దీంతో మళ్ళీ జవసత్వాలు పుంజుకోవడానికి సర్వ శక్తులు కూడగట్టుకుంటున్నాడు. ఇలాంటి క్రూషియల్ పీరియడ్ లో కూతురు కోసం తాపత్రయపడితే రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందని అనుకొని ఉండొచ్చు. అదీ కాకుండా, ఈడీ, సీబీఐ లిక్కర్ కేసును చాలా పకడ్బందీగా డీల్ చేస్తున్నాయి. కోర్టులో కూడా కవితకు చుక్కెదురవుతోంది. ఈడీ, సీబీఐ వాదనలను కోర్టు సమర్ధిస్తోంది. కవితని విచారించడానికి అనుమతి ఇస్తోంది.

సీబీఐ ఇంటరాగేషన్ లో అధికారులు అడిగిన ప్రశ్నలకు కవిత నీళ్లు నమిలిందని, సమాధానాలు దాటవేసిందని  మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదంతా కేసీఆర్ కు తెలుసు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ఎంత బిజీగా ఉన్నా ఢిల్లీలో ఏం జరుగుతున్నదో తెలియకుండా ఎలా ఉంటుంది? కవితను బీజేపీ ఈ కేసులో కావాలనే ఇరికించిందని ఈ సమయంలో చెప్పలేడు. ఎందుకంటే... కేసులో కవిత పాత్ర అంత ప్రముఖంగా ఉంది కాబట్టి. ప్రధాన పాత్రధారి అండ్ సూత్రధారి కవితేనని సీబీఐ చెబుతోంది.

ఇంతకుముందు అరెస్టయిన వారంతా కవిత వైపే వేలెత్తి చూపుతున్నారు. సీబీఐ సాక్ష్యాలన్నీ ముందు పెట్టుకొని కవితను విచారిస్తోంది. ఈరోజుతో ఆమె కస్టడీ అయిపోగానే సీబీఐ మరో 14 రోజులు కస్టడీకి అడిగింది. కానీ కోర్టు 9 రోజులకే పర్మిషన్ ఇచ్చింది. దీంతో కవితను మళ్ళీ తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 23 వరకు ఆమె కస్టడీలో ఉంటుంది. ఇది సీబీఐ కేసు కాదని, బీజేపీ కేసు అని ఆమె మండిపడింది. అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారని అన్నది.

సీబీఐ అధికారులేమో ఆమె విచారణకు సహకరించడం లేదని, దేనికీ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ఇదివరకు చెప్పింది. లిక్కర్ స్కామ్ తో సంబంధమే లేదంది. అందుకే కేసీఆర్ ఏమీ మాట్లాడటంలేదు. కూతురును వెనకేసుకొని రావడంలేదు. బీజేపీని చీల్చి చెండాడంలేదు. కవిత నిజంగా కడిగిన ముత్యమే అయితే తండ్రి, అన్న ఇలా ఉండేవారా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?