లిక్కర్ ముగ్గులోకి కేసీఆర్: అరెస్టు భయం లేనట్టే!

కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటూ.. బెయిలు కోసం రకరకాల కారణాలు చెబుతూ పదేపదే పిటిషన్లు వేస్తూ తనకున్న హక్కును వాడుకుంటున్నారు. అయినా సరే.. ఆమెకు బెయిలు దక్కుతుందా లేదా అనేది సందేహాస్పదంగానే…

కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటూ.. బెయిలు కోసం రకరకాల కారణాలు చెబుతూ పదేపదే పిటిషన్లు వేస్తూ తనకున్న హక్కును వాడుకుంటున్నారు. అయినా సరే.. ఆమెకు బెయిలు దక్కుతుందా లేదా అనేది సందేహాస్పదంగానే ఉంది. ఈలోగానే.. ఆమె తండ్రి కల్వకుంట్ల చంద్ర శేఖ‌ర్ రావు పేరు కూడా లిక్కర్ కేసులో ప్రధానంగా వినిపిస్తోంది.

కవిత బెయిలు పిటిషన్ పై విచారణ సందర్భంగా.. ఈడీ వెల్లడించిన సరికొత్త వివరాల్లో.. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి వివరాలు అన్నీ అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముందే తెలుసునని వెల్లడించారు.

ఈ స్కామ్, దందాకు సంబంధించిన ప్రణాళికారచన మొత్తం ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలోనే జరిగినట్టుగా ఈడీ పేర్కొన్నది. దీని గురించి కవిత ముందుగానే కేసీఆర్ కు చెప్పారని, తన ముఠా సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లై లను కవిత కేసీఆర్ కు స్వయంగా పరిచయం చేశారని ఈడీ పేర్కొంది. వారిద్వారా కేసీఆర్ స్కామ్ ఎలా చేయబోతున్నారో మొత్తం వివరాలు తెలుసుకున్నారని ఆరోపించింది.

కేసీఆర్ తో భేటీ జరిగిన వివరాలను గోపీ కుమరన్ వాంగ్మూలం ద్వారా తెలుసుకున్నట్టు చెబుతూ.. కవిత గత రెండేళ్లలో 11 మొబైల్ ఫోన్లు వాడారని, అందులో నాలుగు ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని, ఆమెకు బెయిలు ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని ఈడీ తెలిపింది. మొత్తానికి బెయిలు పిటిషన్ పై న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.

ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కామ్ ముగ్గులో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తున్నప్పటికీ.. ఆయనకు ఇప్పట్లో అరెస్టు భయం లేదని పలువురు భావిస్తున్నారు. స్కామ్ జరగబోతున్నట్టుగా సంగతి తెలుసుకున్నంత మాత్రాన అది నేరం కాదనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఈ స్కామ్ లో భాగస్వామి అయినట్టుగా గానీ, ఈ స్కామ్ వలన ఆయన లబ్ధి పొందినట్టుగా గానీ ఎక్కడా బయటకు రాలేదు కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మాత్రమే ఇప్పటిదాకా ఈ లిక్కర్ స్కామ్ లో బెయిలు లభించింది. అది కూడా ఆయన పార్టీ సారథి గనుక.. ఎన్నికల ప్రచార నిమిత్తం బెయిలు ఇచ్చారు. ఆయన జూన్ 1న తిరిగి లొంగిపోవాల్సి ఉంటుంది. ఆయన బెయిలు పొడిగింపు కోసం ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. ఆయన బెయిలుకే గ్యారంటీ లేదని, కవితకు బెయిలు దక్కడం అంత ఈజీ కాదని పలువురు అంటున్నారు.

కేసీఆర్ విషయానికి వస్తే.. ఆ వాంగ్మూలంలో వెలికివచ్చిన సంగతుల ఆధారంగా కేసీఆర్ ను కూడా ఒకసారి పిలిపించి విచారించగలరేమో గానీ.. ఆయనను అరెస్టు చేసేంత సీరియస్ నెస్ లేదని పలువురు అంటున్నారు.