Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేసీఆర్ గారూ! స్టాలిన్ ను చూసి నేర్చుకోండి!!

కేసీఆర్ గారూ! స్టాలిన్ ను చూసి నేర్చుకోండి!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోడీని ఎడాపెడా తిడుతూ ఉంటారు. బిజెపి విముక్త భారతదేశాన్ని ఆవిష్కరింప చేయాలని పిలుపు ఇస్తూ ఉంటారు. జాతీయస్థాయి పోరాటం చేయడానికి జాతీయ పార్టీ అవసరం అనే సిద్ధాంతం కూడా తయారు చేశారు. అయితే కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ఎలాగో.. పోరాడడం ఎలాగో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలి. 

అవును మరి.. కేంద్రం అరాచకంగా వసూలు చేసే ఆదాయపు పన్ను విధానం మీద తమిళనాడు హై కోర్టులో.. అధికార డీఎంకే పార్టీ తరఫున ఒక దావా దాఖలు అయింది. కేంద్రం ఆదాయపు పన్నుపేరుతో ప్రజలను ఎంత గుంభనంగా దోచుకుంటున్నదో ఆ పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు.

మన దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గం అంటే అర్ధం ఏడాదికి 8లక్షల కంటే తక్కువ రాబడి ఉన్నవారు మాత్రమే. సుప్రీం న్యాయస్థానం ఈ మేరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గం అంటే ఏమిటో నిర్దేశించింది. ఆ పరిధిలోకి వచ్చేవారికి అందే ప్రభుత్వ పథకాల లబ్ధి ఆదాయపు పన్ను పరిధిలోకి రాదు. 

ఇదిలా ఉండగా, కేంద్రం సాధారణంగా వేతనజీవుల నుంచి వసూలు చేసే ఆదాయపు పన్ను పరిమితి రెండున్నర లక్షలు మాత్రమే. చిరు ఉద్యోగులు అయినా.. అంతకు మించితే ఐటీ పన్ను కట్టాల్సిందే. 

ఒకవైపు ఎనిమిది లక్షల కంటే తక్కువ వచ్చే వాళ్ళందరినీ ఆర్థికంగా వెనుకబడిన వారని గుర్తిస్తూ.. రెండున్నర లక్షలు మించి సంపాదించే వాళ్ళందరిని.. పన్ను కట్టమని ముక్కు పిండి వసూలు చేయడం అర్ధరహితమైన పని! సరిగ్గా ఈ అంశం మీదనే డీఎంకే పార్టీ తరఫున మద్రాసు హైకోర్టులో దావా వేశారు. మద్రాస్ హైకోర్టు కేంద్ర ఆదాయపు పన్ను శాఖకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా పంపనుంది. 

కేంద్ర ప్రభుత్వం ఐటీ విషయంలో ఒక అరాచక విధానం అవలంబిస్తుండగా.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా పద్ధతిగా దానిమీద తన పోరాటం ప్రకటించారు. కేసీఆర్ లాగా ఆయన ఎన్నడూ తిట్టరు, నిందలు వేయరు. ప్రధాని పర్యటనకు వస్తే కనీసం స్వాగతించడానికి వెళ్లకుండా డుమ్మా కొట్టరు. కానీ విధానాల మీద పోరాడడంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపించరు. 

కేసీఆర్ కూడా ఈ విషయం నేర్చుకోవాలి. కేంద్రాన్ని తిట్టవచ్చు నిందలు వేయవచ్చు.. కానీ అంతకంటే ప్రధానంగా వారి విధానాల మీద పోరాటం అలవాటు చేసుకోవాలి. నిందల వలన కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనం ఉంటుందేమో గాని.. అరాచక విధానాల మీద పోరాడితే దేశానికి ప్రయోజనం కలుగుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?