
తెలంగాణలో తీవ్ర దుమారం లేపిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల లక్షల మందికి సమస్య వచ్చిందని, అభ్యర్థులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరారు. ఇదీ వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదన్నారు.
ఇవాళ తెలంగాణ మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పరీక్షలు రద్దు చేయడంతో అభ్యర్థులకు కష్టమే అయినా తప్పలేదన్నారు. అనివార్యంగా పరీక్షలు రద్దు చేశామని.. లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతోందని, ముందే లేనిపోని అనుమానాలు సృష్టించొదన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని.. వ్యవస్థ చక్కగా ఉందన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో తనకేం సంబంధం అని.. ప్రతిపక్షాలు మాట్లాడితే ఐటీ మినిస్టర్ను బర్తరఫ్ చేయాలని అంటున్నారని..అసలు ఐటీ డిపార్ట్మెంట్ పని ఏంటో తెలుసా..ఐటీ మినిస్టర్ ఏం చేస్తరో తెలుసా అని ప్రశ్నించారు. అనవసర వ్యాఖ్యానాల వల్ల విద్యార్థుల్లో అనుమానం కల్పించొద్దన్నారు. బీజేపీ క్రియాశీలక కార్యకర్తగా ఉన్న వ్యక్తి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు లీక్ చేస్తున్నాడనే అనుమానం ఉందని.. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నట్లు వివరించారు.
నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా రద్దు చేసిన పరీక్షలకు ఫీజు వసూలు చేయమన్నారు. అయినా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పేపర్ లీక్ చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడైనా త్వరగా పరీక్షలు నిర్వహించి అర్హులకు ఉద్యోగాలు ఇస్తే మంచిది అంటూన్నారు నిరుద్యోగులు.