Advertisement

Advertisement


Home > Politics - Telangana

జంపింగులకు కేటీఆర్ కొత్త భాష్యం

జంపింగులకు కేటీఆర్ కొత్త భాష్యం

ఫిరాయింపుదారులను జంప్ జిలానీలని, జంపింగ్ జపాంగులని వ్యంగ్యంగా పిలుస్తుంటారు. సాధారణంగా ఫిరాయింపుదారులని అంటారు. గులాబీ పార్టీ నాయకులు కాంగ్రెసులోకి పొలోమని పోతుండటంతో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్.. కొడుకు కేటీఆర్, మేనల్లుడు కేసీఆర్ తెగ బాధ పడిపోతున్నారు. ఆవేదన చెందుతున్నారు. తమకు అన్యాయం జరుగుతోందని గుండెలు బాదుకుంటున్నారు. 

కాంగ్రెస్ నాయకులేమో నీవు నేర్పిన విద్యయే కదా నీరాజాక్ష అంటున్నారు. తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుందన్నట్లుగా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎడా పెడా ఫిరాయింపులను ఎంకరేజ్ చేశాడు. అప్పట్లో కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ అండ్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను, బలమైన నాయకులను తీసుకురావడమే పనిగా పెట్టుకున్నారు. 

అప్పట్లో ఆ రెండు పార్టీలను సమూలంగా నిర్మూలించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే సినిమా కేసీఆర్ కు చూపిస్తున్నాడు. గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతుండటంతో తట్టుకోలేని కేటీఆర్, హరీష్ రావు పైకి మాత్రం ఎంతమంది వెళ్ళిపోయినా తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదంటున్నారు.

కేటీఆర్ ఫిరాయింపులకు కొత్త భాష్యం చెప్పాడు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నవి ఫిరాయింపులని, కానీ తాము ఏనాడూ ఫిరాయింపులను ఎంకరేజ్ చేయలేదని అన్నాడు. తాము అధికారంలో ఉన్నప్పుడు పార్టీలను విలీనం చేసుకున్నామని, అవి ఫిరాయింపుల కిందికి రావని చెప్పాడు. ఎవడో వెనకటికి చిల్లి కాదు తూటు అన్నాడట. అలా ఉంది కేటీఆర్ చెప్పింది.

విలీనం అంటే మూకుమ్మడిగా పార్టీ మారడం అని అర్ధం. అంతే. అదీ ఫిరాయింపు కిందికే వస్తుంది. కానీ కేటీఆర్ మాత్రం తెలివిగా తాము చేసిన ఫిరాయింపులను సమర్ధించుకుంటున్నాడు. విడివిడిగా ఫిరాయిస్తే తప్పుగానీ ఒకేసారి ఫిరాయిస్తే తప్పు కాదని వాదిస్తున్నాడు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయింపుల మీద సుప్రీం కోర్టుకు వెళతామని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, స్పీకరును ఫిర్యాదు చేస్తామని చెప్పాడు. 

ఎవరికీ ఫిర్యాదు చేసినా ఏమీ అయ్యే అవకాశాలు ఉండకపోవొచ్చు. తమ పార్టీ ఓటమికి చిన్న పొరపాట్లే కారణమని చెప్పాడు. తమకు అహంకారం అసలు లేదని అన్నాడు. చిన్న పారపాట్లే చేసిఉంటే, అహంకారం లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు? పార్లమెంటు ఎన్నికల్లో శూన్యం ఎందుకు అవుతారు?

 


  • Advertisement
    
  • Advertisement