Advertisement

Advertisement


Home > Politics - Telangana

అహంకారం అనేది కారణం కాదు!

అహంకారం అనేది కారణం కాదు!

కల్వకుంట్ల వారికి ఇంకా వాస్తవాలను అంగీకరించడానికి మనసొప్పడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు.. అందుకు దారితీసిన కొన్ని కారణాలను బహిరంగంగా ఒప్పుకోవడం.. భవిష్యత్తుకు కూడా చేటు చేస్తుంది. ప్రత్యర్థులకు అదనపు అస్త్రాలను అందిస్తుంది. అందువల్ల ఒప్పుకోరు. కానీ అంతర్గతంగా వాటిని చర్చించుకుని సమీక్షించుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఓటమి కారణాలను బహిరంగంగా ఒప్పుకోవడమే.. ప్రజల ఎదుట నేతల గౌరవాన్ని పెంచుతుంది. కానీ.. గులాబీ దళపతులు మాత్రం అందుకు సిద్ధంగా లేరు.

భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తాజాగా మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోవడానికి అహంకారం ఒక కారణం అంటే తాను ఒప్పుకోను అని సెలవిస్తున్నారు. వాళ్లంటే కిట్టనివాళ్లు అలా ప్రచారం చేశారట. అయినా కిట్టనివాళ్లు ఎన్నికలకు ముందు దుష్ప్రచారాలు చేస్తారు గానీ.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, పార్లమెంటు ఎన్నికల్లో సున్న స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా చచ్చినపామును కొట్టినట్టుగా వీరి గురించే ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అయినా సరే.. అహంకారాన్ని కేవలం ప్రత్యర్థుల ప్రచారం అని ప్రొజెక్టు చేయడానికి కేటీఆర్ ఉత్సాహపడుతున్నారు.

పదేళ్లలో వాళ్లు అద్భుతమైన పరిపాలన అందించారట. ఆ విషయంలో వారిని ఢీకొనలేక అహంకారం అని అందరూ ప్రచారం చేశారట. ఇదీ కేటీఆర్ మాట! అలాగే.. పార్టీలో సగానికి పైగా నాయకులు పార్టీ పేరును భారాసగా మార్చడం వల్ల దెబ్బతిన్నట్టుగా చెబుతున్నారు. తిరిగి తెరాస అయితే తప్ప మనుగడ ఉండదని కూడా భయపడుతున్నారు. కానీ.. కేటీఆర్ ఆ వాదనను కూడా తోసిపుచ్చుతున్నారు. అవన్నీ తాను నమ్మను అంటున్నారు.

కేసీఆర్ మాటలు ఎవరికైనా చిత్రంగా కనిపిస్తాయి. ఒకవైపు ప్రజలతో సంబంధాలలో కొంత గ్యాప్ వచ్చిందని ఆయనే అంటున్నారు. నిజానికి కేసీఆర్, కేటీఆర్ వంటి మొనార్క్ లుగా వ్యవహరించిన నాయకులకు కేవలం ప్రజలతో మాత్రమే కాదు కదా.. పార్టీ నాయకులతో కూడా చాలా గ్యాప్ వచ్చింది.

మంత్రి స్థాయి వారు కూడా కేటీఆర్ ను కూడా కలవలేకపోయేవారంటే అతిశయోక్తి కాదు. ప్రచారం ఎవరు చేశారని కేటీఆర్ అంటున్నారో గానీ.. సొంత పార్టీ వారే నేతల అహంకారాన్ని తలచుకుంటూ విలపిస్తుండేవారు. ఓటమికి దారితీసిన అసలు కారణాలను ఇప్పటికీ అంగీకరించకపోవడంలోనే.. కేటీఆర్ యొక్క అపరిమితమైన అహంకారం కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 


  • Advertisement
    
  • Advertisement