Advertisement

Advertisement


Home > Politics - Telangana

పరువు పోతుందని తెలిసినా అదే ఓవరాక్షన్!

పరువు పోతుందని తెలిసినా అదే ఓవరాక్షన్!

ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి ఎంత తక్కువగా మాట్లాడితే వారికి అంత మంచిది. 2014లో గాని, 2018లో గాని తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇతర పార్టీల నుంచి ఇటువంటి అనైతికమైన ఫిరాయింపులను వారు ఎంతగా ప్రోత్సహించారో అందరికీ తెలుసు.

ఒకసారి తెలుగుదేశం- మరొకసారి కాంగ్రెస్ పార్టీలను దాదాపుగా ఖాళీ చేసేశాం అనుకుని వారు మురిసిపోయారు. తీరా ఇప్పుడు వాతావరణం ప్రతికూలంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాము గేట్లు తెరిస్తే భారత రాష్ట్ర సమితి ఖాళీ అయిపోతుందని ఒక హెచ్చరికను విడుదల చేసి.. నెమ్మదిగా ఫిరాయింపులకు వారు శ్రీకారం చుట్టారు.

ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ ఫిరాయింపుల గురించి భారాస చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నది. స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు, హైకోర్టులో కూడా కేసులు వేస్తున్నది. ఫిరాయింపుల విషయంలో ఎవరినీ ప్రశ్నించే నైతిక హక్కు తమకు లేదని, ఫిరాయింపులు గురించి తాము చేస్తున్న ఆందోళన ప్రజల దృష్టిలో హాస్యాస్పదం అవుతుందని వారు అర్థం చేసుకోవడం లేదు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెసులోకి వచ్చేసారు. ఇంకా పాతికమందికి పైగా కాంగ్రెసులో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

దానం నాగేందర్ పార్టీకి ఫిరాయించడం మీద, భారాస ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరుతూ లేఖ  ఇవ్వడానికి ప్రయత్నిస్తే.. అసలు స్పీకర్ అపాయింట్మెంట్ దొరకడం లేదని భారాస నాయకులు విమర్శలు చేస్తున్నారు. స్పీకర్ తమకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే గనుక.. అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగుతామని భారాస నాయకులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలకు మాత్రం వీరి హెచ్చరికలు కామెడీగా కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెసులో చేరదలచుకుంటే వారు తమ పదవికి రాజీనామా చేసిన తర్వాత గాని చేర్చుకోబోయేది లేదని కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించింది.. ‘వారు ఆ మాట నిలబెట్టుకోవడం లేదు’ అనే ఆరోపణ తప్ప ఫిరాయింపుల గురించి ప్రశ్నించడానికి కల్వకుంట్ల తారకరామారావు వద్ద కూడా మరొక పాయింట్ లేదు. అలాంటి విమర్శ చేసినప్పుడు.. వాళ్లు రాజీనామాలు చేయించి చేర్చుకుంటూ ఉంటే.. మీరు మాత్రం అడ్డగోలుగా చేర్చుకుని మంత్రి పదవులు ఇస్తూ పోతారా? అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది.

మీరు చేసిన సకల అరాచక ఫిరాయింపులను సమస్తంగా మరిచిపోయి.. ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు పోయినందుకే ధర్నాలకు దిగడానికి పూనుకోవడం చూస్తే చిత్రంగా ఉన్నదని ప్రజలు అంటున్నారు. ముందు ముందు ఎంపీ ఎన్నికలు పూర్తయ్య సమయానికి మరింతమంది ఎమ్మెల్యేలు భారాస నుంచి కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉన్నదని.. విమర్శలను ఆందోళన కార్యక్రమాలను అప్పటికి కొంచెం దాచి పెట్టుకోవాలని ప్రజలు అంటున్నారు.

ఏ నాయకుడు ఫిరాయించినా ప్రతి పార్టీ చెప్పేది ఒక్కటే. "అవకాశవాద నాయకులు మాత్రమే పార్టీలు మారుతుంటారు.. మా పార్టీకి కార్యకర్తల బలం చెక్కుచెదరకుండా ఉంది" అని అంటుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న పని కూడా అదే. ఎమ్మెల్యేలు ఫిరాయించినందుకు ఆందోళనల రూపేణా వృథా ప్రయాసను మానుకుని, తమకు బలం అని చెప్పుకుంటున్న కార్యకర్తలను నాయకులుగా తయారు చేసుకోవడంపై శ్రద్ధ పెడితే వారికే మేలు జరుగుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?