పాట‌లో రెడ్డి ప్ర‌స్తావ‌న లేదు.. అందుకే తీసేయించారు!

తెలంగాణ రాష్ట్ర గీతం, అలాగే చిహ్నంపై వివాదం కొన‌సాగుతోంది. ఈ రెండింటిపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇటీవ‌ల అఖిల‌ప‌క్ష స‌మావేశం కూడా నిర్వ‌హించారు. తెలంగాణ చిహ్నం తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో…

తెలంగాణ రాష్ట్ర గీతం, అలాగే చిహ్నంపై వివాదం కొన‌సాగుతోంది. ఈ రెండింటిపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇటీవ‌ల అఖిల‌ప‌క్ష స‌మావేశం కూడా నిర్వ‌హించారు. తెలంగాణ చిహ్నం తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో ప్ర‌స్తుతానికి ఆ అంశాన్ని ప‌క్క‌న పెట్టారు. కానీ తెలంగాణ గీతాన్ని మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

అందెశ్రీ రాసిన గీతానికి కీర‌వాణి సంగీతం అందించ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌లో సంగీత క‌ళాకారులున్న‌ప్ప‌టికీ, ఆంధ్రాకు చెందిన కీర‌వాణి సంగీతం అందించ‌డం ద్వారా, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ‌తీశారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే క‌ళ‌కు ప్రాంతం, కులం, మతం అంట‌క‌ట్ట‌డం ఏంట‌నే నిల‌దీత‌లు కూడా లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర గీతంపై ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ కీల‌క కామెంట్స్ చేశారు.

అందెశ్రీ రాసిన రాష్ట్ర‌ గీతం జ‌య జ‌య‌హే తెలంగాణంలో సారం లేకుండా చేశార‌ని విమ‌ర్శించారు. ఈ గేయంలో స‌మ్మ‌క్క సార‌క్క‌, కొమ్రంభీమ్ పేర్లు లేకుండా చేశార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కంచ‌ర్ల గోప‌న్న‌తో స‌హా క‌వుల పేర్లు గేయంలో ఎక్క‌డున్నాయ‌ని మంద‌కృష్ణ మాదిగ ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిన సంపూర్ణ గేయాన్ని ఆమోదించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.  

సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన‌ట్టు విని అందెశ్రీ త‌న గౌర‌వాన్ని పోగొట్టుకున్నార‌ని విమ‌ర్శించారు. అందెశ్రీ పాట‌లో రెడ్డి ప్ర‌స్తావ‌న లేద‌నే కార‌ణంతోనే మిగిలిన కులాల వారి పేర్ల‌ను కూడా తొల‌గించాల‌ని ఆయ‌న సెటైర్ విసిరారు.