నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టి, ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిపేసి, తిరిగి ప్రారంభించి, లక్ష్యాన్ని చేరుకోకుండానే ముగించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తారని అంతా అనుకున్నారు. కానీ కూటమి ఏర్పాటుతో లోకేశ్‌కు ప్రాధాన్యం తగ్గిపోయింది.
కేవలం తాను పోటీ చేస్తున్న మంగళగిరికే ఆయన పరిమితం అయ్యారు. ఎన్నికల తర్వాత కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తండ్రీతనయులైన చంద్రబాబు, లోకేశ్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్టు టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎందుకనో నోరు మెదపడం లేన్నారు. బాబు గుంభనంగా ఉన్నారన్నారు.
ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయో ముందే తెలియడం వల్లే బాబు మౌనాన్ని ఆశ్రయించారని సజ్జల అన్నారు. నారా లోకేశ్ అసలు దేశంలోనే ఉన్నారా? అంటూ మీడియా ప్రతినిధుల్ని సజ్జల ప్రశ్నించడం గమనార్హం. ఇవాళే విదేశీ పర్యటన నుంచి లోకేశ్ తిరిగి వచ్చారని సజ్జలకు మీడియా ప్రతినిధులు చెప్పారు.
లోకేశ్ అడ్రస్ లేరంటూ సజ్జల వ్యంగ్యంగా అన్నారు. బాబు, లోకేశ్ తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారం దక్కించుకున్న తర్వాత ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని, అందుకే అంత వరకూ వేచి చూసే ధోరణితో ఉండాలని బాబు, లోకేశ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు అర్థమవుతోంది. అయితే ఏ పార్టీ అంచనా నిజమవుతుందో తెలియడానికి కేవలం గంటల సమయం మాత్రమే వుంది.