సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ పేరు నిన్నంతా మార్మోగిపోయింది. ఆమె తప్పతాగి, తన నివాసం దగ్గరున్న కొంతమంది వ్యక్తులతో గొడవకు దిగిందని కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. తాజాగా దీనిపై ముంబయి పోలీసులు వివరణ ఇచ్చారు..
ఇంతకీ ఏం జరిగిందంటే..
రవీనా టాండన్ కారు డ్రైవర్, ఆమె కారును పార్క్ చేయడం కోసం రివర్స్ చేశాడు. అదే టైమ్ లో కొంతమంది వ్యక్తులకు చాలా దగ్గరగా కారు వచ్చింది. వాళ్లు ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు గుమిగూడారు. రవీనా డ్రైవర్ తో వాదులాటకు దిగారు.
పరిస్థితిని గమనించిన రవీనా టాండన్, తన డ్రైవర్ ను కాపాడేందుకు తను కూడా ఆ సీన్ లోకి ఎంటరైంది. చిన్నపాటి ఘర్షణ తలెత్తింది. రవీనా డ్రైవర్ కారును రివర్స్ చేస్తూ, తన తల్లిని ఢీకొట్టాడని ఓ వ్యక్తి ఆరోపించాడు. అదే టైమ్ లో ఆమె తాగి తమతో గొడవ పడిందని కూడా చెప్పుకొచ్చాడు.
రంగంలోకి దిగిన పోలీసులు..
జరిగిన గొడవపై పోలీసులు రంగంలోకి దిగారు. నివాసానికి చుట్టుపక్కలున్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించారు. రవీనా కారు రివర్స్ లో వచ్చిన మాట వాస్తవమేనని, కానీ అది ఎవ్వర్నీ ఢీకొట్టలేదని, కనీసం తాకను కూడా తాకలేదని పోలీసులు స్ఫష్టం చేశారు.
అంతేకాదు, ఆ టైమ్ లో రవీనా టాండన్ మద్యం సేవించలేదని కూడా పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కేవలం కొంతమంది వ్యక్తులు గుమిగూడడం వల్ల ఘర్షణ తలెత్తిందని తెలిపిన పోలీసులు.. రవీనాకు వ్యతిరేకంగా తమకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేశారు.
మరోవైపు డ్రైవర్ ను కాపాడ్డం కోసం రవీనా లాంటి సెలబ్రిటీ చొరవ తీసుకోవడం చాలా గొప్ప విషయం అంటూ కొంతమంది ఆమెను పొగుడుతున్నారు. ఓ మహిళ అయినప్పటికీ, తనకు సెక్యూరిటీ లేనప్పటికీ, ఆమె ధైర్యంగా తన డ్రైవర్ కోసం నిలబడడం చాలామందికి నచ్చింది.