కవితక్క ఇప్పట్లో ఇంటికి రావడం కష్టమే!

కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబందించి.. ఈడీ కేసులో అరెస్టు అయిన కవిత రిమాండు ముగియడంతో సోమవారం కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు.…

కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబందించి.. ఈడీ కేసులో అరెస్టు అయిన కవిత రిమాండు ముగియడంతో సోమవారం కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. ఆమె రిమాండును నెలరోజుల పాటూ కోర్టు పొడిగించింది.

అదే సమయంలో.. సీబీఐ కేసుకు సంబంధించి.. మధ్యాహ్నం మళ్లీ కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టగా.. ఈ నెల 7వ తేదీవరకు రిమాండ్ పొడిగించారు. ఆ రోజున సీబీఐ చార్జిషీట్ వేయనుంది. ఆ తర్వాత.. సీబీఐ కేసుకు సంబంధించి కవిత భవితవ్యం ఏమిటో తేలుతుంది.  ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు.

అయితే కవిత ఇప్పట్లో ఈ నేరారోపణల నుంచి బయటపడి ఇంటికి రావడం కష్టమే అని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడున్నర నెలలుగా జైలులోనే ఉన్న కల్వకుంట్ల కవిత ఇప్పటికే పలుమార్లు బెయిలు కోసం అటు రౌజ్ అవెన్యూ కోర్టులోను, ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్లు వేసి భంగపడ్డారు. కవితకు వ్యతిరేకంగా, లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్రను నిర్ధరించే ఆధారాలు చాలా ఉండడంతో.. ఆమెకు ఏ ప్రయత్నంలోనూ బెయిల్ లభించలేదు.

లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లిన ముగ్గురు కీలక నేతలు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారు. కేజ్రీవాల్ ఆప్ పార్టీ సారథి గనుక.. ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి మాత్రమే ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది.

ఎన్నికల చివరి విడత పోలింగు ముగిసిన వెంటనే.. ఆయన తిరిగి జైలుకు వెళ్లక తప్పలేదు. వృద్ధ తల్లిదండ్రులు, ఆరోగ్య కారణాలు వంటి రకరకాల మిషల మీద బెయిలు పొడిగించుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. సిసోడియాకు అసలు బెయిలే దక్కలేదు. మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆషామాషీ కేసు కాదని.. ఇందులో ఏకంగా 1100 కోట్ల నేరపూరిత అక్రమార్జన జరిగినదని ఈడీ కోర్టులో అనుబంధ చార్జిషీట్ వేసింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ లభించడం అంత ఈజీ కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.