సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో చివరి అంకానికి చేరుకున్నాం. ఎన్నికల ఫలితాల్ని తేల్చే కౌంటింగ్ మరికొన్ని నిమిషాల్లో మొదలు కానుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి అనుచరుల్లో గుండె వేగం పెరిగింది. ఈ ఎన్నికలు తమ రాజకీయ భవిష్యత్‌ను తేల్చేవి కావడంతో సహజంగానే నాయకుల్లో ఉత్కంఠ, ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ రోజు కోసమే సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్ తదితర ముఖ్య నాయకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు… ఐదేళ్ల పాటు ప్రతి నిమిషం ఒక యుగంగా గడిపారు. ఈ ఐదేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఊహించిన విధంగా జైలుకెళ్లాల్సి రావడం చంద్రబాబు జీవితంలో పీడకలే అని చెప్పాలి.
అలాగే అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌కు అంతా సాఫీగా సాగలేదు. మధ్యలో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి ఏపీని మాత్రమే కాదు, యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసింది. అయినప్పటికీ కరోనా లాంటి విపత్కర సమయంలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్ దక్కించుకున్నారు. సంక్షేమ పథకాల అమల్లో భేష్ అనిపించుకున్న జగన్, ఇతర రంగాలపై దృష్టి సారించలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు.
ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరిగింది. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడంలో జగన్ విఫలమయ్యారనే చెడ్డ పేరు తెచ్చుకున్నారు. తమకు జగన్ న్యాయం చేయకపోగా, తీవ్ర అన్యాయం చేశారనే ఆగ్రహం ఉద్యోగుల్లో వుంది. ఆ ఎఫెక్ట్ తాజా ఎన్నికల్లో చూపుతుందనే ఆందోళన వైసీపీలో వుంది. అలాగే అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారనే నెగెటివ్ ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ప్రభుత్వ అనుకూలత ఎంత ఉందో, వ్యతిరేకత కూడా అంతే పెంచుకున్నారనే ప్రచారం ఇంత కాలం సాగుతూ వచ్చింది. అది ఎంత మాత్రమో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇక జనసేనాని పవన్‌కల్యాణ్ విషయానికి వస్తే , ఈ దఫా ఎమ్మెల్యేగా గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సందర్భంలో జగన్ సర్కార్‌ను గద్దె దించడమే ఆశయంగా ఆయన రాజకీయం చేశారు. టీడీపీతో తాను పొత్తు పెట్టుకోవడమే కాకుండా, బీజేపీని దగ్గర చేర్చడంలో పవన్ సక్సెస్ అయ్యారు. మూడు పార్టీలు కలయికతో జగన్ ఎంత బలవంతుడో చెప్పకనే చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఐదేళ్ల పాలనలో ప్రతి ఇంటికి మంచి జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల్లో విజయంపై వైసీపీ, కూటమి ధీమాగా ఉన్నాయి. విజేత ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తినబోతు రుచి చూడడం ఎందుకు? ఎన్నికల ఫలితాలను ఆస్వాదించేందుకు సిద్ధంకండి.