ఎన్నారై తెలివి: గెలవకముందే బాబుకు బిస్కట్లు!

గెలిచిన నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ముందుకు వచ్చే ప్రబుద్ధులు చాలా మందే ఉంటారు. కానీ గెలవకముందే బిస్కట్లు వేసి, అదనపు మైలేజీ తెచ్చుకోగల తెలివితేటలు మాత్రం కొందరికే ఉంటాయి. ఎన్నారైలుగా విదేశాలలో ఉంటూ డాలర్లలో …

గెలిచిన నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ముందుకు వచ్చే ప్రబుద్ధులు చాలా మందే ఉంటారు. కానీ గెలవకముందే బిస్కట్లు వేసి, అదనపు మైలేజీ తెచ్చుకోగల తెలివితేటలు మాత్రం కొందరికే ఉంటాయి. ఎన్నారైలుగా విదేశాలలో ఉంటూ డాలర్లలో  సంపాదించే కులీనులకు అలాంటి తెలివితేటలు పుష్కలంగా ఉండడంలో ఆశ్చర్యం ఏముంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ కొన్ని చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనావేస్తుండగా.. ఎందుకైనా మంచిదని ఎన్నారైలు ముందే ఆయనకు చందాలు, విరాళాలు సమర్పించుకుంటున్నారు.

సాధారణంగా రాజకీయ నాయకుల్ని ప్రలోభ పెట్టడానికి రకరకాల మార్గాలుంటాయి. ‘లంచాలు’, లేదా తమకు కేటాయించే కాంట్రాక్టులు, తమకు చేసే ఫేవర్లలో వాటాలు అనేది చాలా చిన్న మాట. ఇలాంటివి గుట్టు చప్పుడు కాకుండా, చాటుమాటుగా జరిగిపోతుంటాయి. కానీ బహిరంగంగా ప్రలోభపెట్టడం కూడా సర్వసాధారణం. అవి వేరే రూపాల్లో ఉంటాయి. అత్యంత విలువైన గిఫ్టులు ఇవ్వడం ఒక తరహా!

అలా కాకుండా.. నాయకులకు సంబంధించిన ట్రస్టులు, లేదా సేవా కార్యక్రమాల ముసుగు వేసుకున్న సంస్థలకు భారీ మొత్తాలు విరాళం, చందా ఇవ్వడం వైట్ మనీని దోచిపెట్టే మరో మార్గం అన్నమాట. ఇప్పుడు ఎన్నారై ఔత్సాహికులు చంద్రబాబునాయుడును ఆ మార్గాల్లో బుట్టలో వేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన ఎన్టీఆర్ ఫౌండేషన్ కు ఎన్నారై మన్నవ మోహనక్రిష్ణ రెండుకోట్ల రూపాయల చెక్కు విరాళంగా అందించారు. ఆయన తెలుగుదేశం పార్టీకి కార్యనిర్వాహక కార్యదర్శి కూడా. ఆయనను చంద్రబాబు అభినందించడం చాలా సహజంగా జరిగింది కూడా. ఎన్టీఆర్ ట్రస్టుకు మోహనక్రిష్ణ భారీ విరాళాలు ఇదేమీ కొత్త కాదు. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఆయన గుంటూరు వెస్ట్ టికెట్ ను ఆశించారు.

గతంలో ఎన్ని విరాళాలు ఇచ్చినా, టికెట్ విషయంలో భంగపాటు ఎదురైంది. ఎన్టీఆర్ ఫౌండేషన్ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నదని ఆయన సెలవిచ్చారు గానీ.. ఆ సేవలను ప్రోత్సహించడానికి ఆయన ఎప్పుడైనా విరాళం ఇచ్చి ఉండవచ్చు. అలాకాకుండా ఫలితాలు వచ్చే ముందురోజున, చంద్రబాబు గెలుస్తారనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్ముకుని ఇవ్వడమే తమాషా. మరో ఎన్నారై బొద్దులూరి క్రిష్ణ తెలుగుదేశం పార్టీకి రూ.25 లక్షల విరాళం ఇచ్చారు. ఇలా చంద్రబాబు గెలవడానికి ముందు నుంచే.. ఆయనకు ఎన్నారైలు బిస్కట్లు వేయడం మొదలైందన్నమాట.

ఇవన్నీ బహిరంగ విషయాలు. పైన చెప్పుకున్న చాటుమాటు ప్రలోభాలను ఇప్పటికే ఎంత మంది ప్రారంభించి ఉంటారో లెక్కేలేదు. ఆల్రెడీ జయరాం కోమటి వంటి తెలుగుదేశం దళారీలు.. ఎన్నారైలంతా.. తమ తమ ఊళ్లలో వైసీపీ చెందిన ఒక్కో కుటుంబానికి రెండు మూడు లక్షలు డబ్బులు ఇచ్చి అయినా సరే.. ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓట్లు వేయించాలని పురమాయించిన సంగతి అందరికీ తెలిసిందే.

అలా, ఎన్నికల ప్రచార పర్వం సమయంలోనే, దొంగచాటుగా తెలుగుదేశం మీద కోట్లకు కోట్లు కుమ్మరించిన వాళ్లు ఎందరున్నారో కదా.. వారందరికీ చంద్రబాబు రిటర్న్ గిఫ్టులు ఇచ్చిన తర్వాత కదా.. చంద్రబాబు వీరివైపు చూడబోయేది అని ప్రజలు అనుకుంటున్నారు.