Advertisement

Advertisement


Home > Politics - Telangana

గంటమోగినా గులాబీలు స్పందించడం లేదే!

గంటమోగినా గులాబీలు స్పందించడం లేదే!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగింది. మే 10వ తేదీన అక్కడ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. అంటే ఇవాళ్టికి కేవలం నలభై రోజుల వ్యవధిలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. జాతీయ పార్టీగా రూపు మార్చుకుని కొత్తగా ఆవిర్భావ వేడుకను నిర్వహించుకున్నప్పుడు.. కర్ణాటక ఎన్నికలతోనే శ్రీకారం దిద్దుతూ జాతీయ రాజకీయాల్లోకి తమ తొలి అడుగులు వేస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసిన భారత రాష్ట్ర సమితి ఇప్పటిదాకా ఏమీ చప్పుడు చేయడం లేదు. 

తాను జాతీయ నాయకుడిగా ఎదిగే ప్రయత్నంలో.. ఈ కర్నాటక ఎన్నికలకు కేసీఆర్ ఒక మెట్టుగా ఉపయోగించుకుంటున్నారా? లేదా? అనేది సందేహంగానే ఉంది. పార్టీ విస్తరణకు వచ్చిన అవకాశాన్ని ఆయన కాలదన్నుకుంటున్నారనే అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తం అవుతోంది. 

కేసీఆర్ తన జాతీయ పార్టీ ఆలోచనను ప్రకటించిన తొలిరోజుల్లోనే ఆయన వెంట నిలిచిన ఏకైక, మొదటి పరరాష్ట్ర నాయకుడు, కర్నాటకకు చెందిన జేడీఎస్ నేత  కుమారస్వామి. అదే కుమారస్వామి ఖమ్మంలో భారీ స్థాయిలో నిర్వహించిన పార్టీ సభకు అయిపులేరు. మొత్తానికి ఈ మధ్యలో ఏదో జరిగిందనే అనుమానం ప్రజలకు కలిగింది. 

భారాసను జాతీయ పార్టీగా రూపుదిద్దిన తర్వాత.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే ఇతర రాష్ట్రాలకు తమ పార్టీ విస్తరించడం మొదలవుతుందని కేసీఆర్ చాలా ఘనంగా ప్రకటించారు. అప్పట్లో ఆయన మాట నమ్మశక్యంగానే అనిపించింది. తెలంగాణకు పొరుగున అనేక కన్నడ ప్రాంతాలున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. 

కన్నడ రాజధానికంటె హైదరాబాదుతోనే ఎక్కువ రాకపోకలు ఉండే కన్నడిగులు కూడా ఉన్నారు. ఇలా కేసీఆర్ మొదటి అడుగు ఫలవంతంగానే పడుతుందని అనిపించింది. అయితే భారాస కర్నాటక ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తుందా? జేడీఎస్ తో పొత్తులతోనా అనే స్పష్టత రాలేదు. 

కేసీఆర్ తో స్నేహం కొనసాగిస్తూనే.. కుమారస్వామి మాత్రం.. కర్నాటకలో తమ పార్టీ ఒంటరిగానే రంగంలోకి దిగుతుందని చెప్పేశారు. మరోవైపు భారాస తెలంగాణ మంత్రులు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పోటీచేస్తుందని లీకులు వదులుతూ వచ్చారు. 

తీరా ఇప్పుడు కన్నడ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత.. భారాస తరఫున ఎవరూ చప్పుడు చేయడం లేదు. కనీసం తాను జాతీయ పార్టీగా విస్తరించినప్పుడు తోడుగా ఉన్న కుమారస్వామికి అండగా ఉంటామని కూడా కేసీఆర్ చెప్పడం లేదు. వీరి మధ్య ఏ స్థాయిలో రిలేషన్స్ బెడిసి కొట్టాయోనని జనం రకరకాలుగా ఊహించుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?