Advertisement

Advertisement


Home > Politics - Telangana

సాగదీసే కొద్దీ మొదటికే మోసం వస్తుందా?

సాగదీసే కొద్దీ మొదటికే మోసం వస్తుందా?

ఖమ్మం జిల్లాలో కీలక రాజకీయ నాయకుల్లో ఒకరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ వ్యతిరేకత, కేసీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు సాగుతున్న ఆయనకు జూపల్లి కృష్ణారావు కూడా జత కలిశారు. 

ప్రస్తుతానికి ఈ ఇద్దరు నాయకులకు నిర్దిష్టంగా ఒక పార్టీ అంటూ లేకపోవడంతో.. యాంటీ కేసీఆర్ ఎజెండా ఉన్న ప్రతిపార్టీ  కూడా పొంగులేటిని సంప్రదిస్తూనే ఉంది. అయితే, ఆయన తన భవిష్యత్ కార్యచరణ ప్రణాళిక ఏమిటో నిర్దిష్టంగా ఒక మాట చెప్పకుండా.. ఏ పార్టీలో చేరుతాడో తేల్చకుండా.. డొంకతిరుగుడు రాజకీయం నడిపిస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా పొంగులేటి దోబూచులాట రాజకీయంతో సాగదీస్తున్నారు. ఆయన సాగతీత వైఖరికి మొదటికే మోసం అవుతుందా.. అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేసీఆర్ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి చాలాకాలమే అయింది. ఆ తర్వాత ఆయనను పార్టీ వదిలించుకుంది కూడా. ఆ సమయంలోనే ఆయన ఏ పార్టీలో చేరిపోయి ఉన్నప్పటికీ.. ఈ సరికి సీనియర్ లీడర్ అనే హోదాలోకి వచ్చి ఉండేవాళ్లు! మంచి ప్రాధాన్యం పెరిగి ఉండేది. కానీ అపరిమితమైన ధనబలం కారణంగా తాను ఎంత లేటుగా చేరినా సరే.. తనకు ఎవ్వరైనా ప్రాధాన్యం ఇచ్చి తీరాల్సిందే అనే భావనలో పొంగులేటి ఉన్నారు.

ఆయనతో ఉన్న కుటుంబ సాన్నిహిత్యాన్ని బట్టి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకురాలు షర్మిల ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి మంతనాలు సాగించి విఫలమయ్యారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పడిన వైతెపాకు ఆయన చేరిక లాభమేగానీ, అది ఫలించలేదు. ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ మంతనాలు సాగించింది. 

బిజెపి తరఫున బోలెడు మంది నాయకులు ఆయన ఇంటికి వెళ్లి ఒక రోజంతా సుదీర్ఘ మంతనాలు జరిపారు. కానీ బేరం మాత్రం ఫైనలైజ్ కాలేదు. ఏ పార్టీలో చేరేది తేల్చకుండా.. ఖమ్మం జిల్లా అంతా ఆత్మీయ సమావేశాల పేరిట విందుభోజనాలు ఏర్పాటు చేసుకుంటూ వెళుతున్న పొంగులేటి తాజాగా అలాంటి ఓ  మీటింగుకు కోదండరాంను ఆహ్వానించారు. కోదండరాం పార్టీ ప్రస్తుతం తెలంగాణలో సోదిలో లేదు.

పైగా ఇన్నాళ్లూ ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆ జిల్లా అంతటా తన మనుషులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్న పొంగులేటి ఇప్పుడు మొత్తం 119 నియోజకవర్గాల గురించి మాట్లాడుతున్నారు. అన్నిచోట్లా ఒకే ఫార్ములాతో ముందుకువెళ్లి కేసీఆర్ ను గద్దె దింపుతారట. కేసీఆర్ తో ప్రధానంగా తలపడుతున్న కాంగ్రెస్, బిజెపి ల ఆఫర్లను తిరస్కరించిన పొంగులేటి సుదీర్ఘమైన సాగతీత తర్వాత ఒంటరిగా బరిలోకి దిగడం గురించి గానీ, లేదా, మంచి నాయకుడనే ముద్ర ఉన్న కోదండరాం పార్టీకి తాను ధన బలంగా, అండగా నిలిచి ఆ పార్టీ తరఫున గానీ బరిలో ఉంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఏది ఏమైనప్పటికీ.. భవిష్యత్ కార్యచరణ తేల్చకుండా.. ఇంత సుదీర్ఘంగా సాగతీస్తూ పోవడం అనేది పొంగులేటికే చేటు చేస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?