Advertisement

Advertisement


Home > Politics - Telangana

‘గులాబీ’కి తొడిమ, ముళ్లు మిగులుతాయా?

‘గులాబీ’కి తొడిమ, ముళ్లు మిగులుతాయా?

గులాబీ అందం అందరికీ తెలుసు. దానికి ఉండే ముళ్లు కూడా తెలుసు. అయితే తెలంగాణలో పదేళ్లు రాజ్యం చేసిన గులాబీదళం ప్రస్తుత పరిస్థితి ఏమిటి. ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతోందా? కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల రాజకీయానికి ఆ పార్టీ చాలా వరకు ఖాళీ అవుతుందా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఈ రెండు సీనియర్ జాతీయ పార్టీలు- కొత్త జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి నాయకుల్ని చెరొకవైపు నుంచి లాగేసుకుంటూ ఉండడమే ఇందుకు నిదర్శనం. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణలోని బిఆర్ఎస్ ఎంపీలు పార్టీని వీడుతూ ఉండడమే ప్రజల్లో ఆ అభిప్రాయాన్ని కలిగిస్తోంది.

17 ఎంపీ సీట్లున్న తెలంగాణలో భారాస గత ఎన్నికల్లో పది గెలిచినప్పటికీ.. ఇప్పుడు అది 8కి పడిపోయింది. ఈ బలం కూడా స్థిరంగా ఉంటుందనే గ్యారంటీ లేదు. గులాబీ ఎంపీలు పక్కచూపులు చూస్తూ ఉండడమే అందుకు కారణం.

పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇటీవల భారాసను వీడి కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఎంపీ వికెట్లు పడడం అప్పుడు స్టార్ట్ అయింది. అయితే బిఆర్ఎస్ టీమ్ లో రెండో వికెట్ ను మాత్రం బిజెపి తీయడం విశేషం. నాగర్ కర్నూలు ఎంపీ రాములు భారాసను వీడి, కొడుకుతో సహా తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర బిజెపి ఇన్చార్జి తరుణ్ ఛుగ్, లక్ష్మణ్, డికెఅరుణ తదితరుల సమక్షంలో ఆయన చేరడం విశేషం. తాను సిటింగ్ ఎంపీ అయినప్పటికీ.. అమిత్ షా, నడ్డా వంటి అగ్రనేతల సమక్షంలో చేరాలనే ఆలోచన కూడా చేయకుండా ఆయన అర్జంటుగా పార్టీ పోవడం జరిగింది.

స్థానికంగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో రాములుకు విభేదాలు ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి తానేనంటూ గువ్వల బాలరాజు అక్కడ ప్రచారం చేసుకుంటూ ఉండడం.. ఆయన ధోరణిని కట్టడి చేయడం గురించి గులాబీ అధిష్ఠానం పట్టించుకోకపోవడం వల్లనే రాములు పార్టీని వీడి బిజెపిలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బిజెపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఆయన కోరినట్టుగా రాబోయే ఎన్నికల్లో సీటు గ్యారంటీ ఇవ్వడానికి బిజెపి సిద్ధంగా లేదని, హామీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయినా సరే.. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకం పలువురిలో బలంగా ఉన్నందువల్ల ఎంపీలుగా రాజకీయ భవిష్యత్తు స్థిరంగా ఉండాలంటే.. బిజెపితో వెళ్లడమే సేఫ్ అని వారు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

భారాస నుంచి ఇప్పటికే రాష్ట్రంలో అనేక మునిసిపాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఎంపీలు ఇప్పుడు ఒక్కరొక్కరుగా రాలిపోతున్నారు. ఎమ్మెల్యేల మీద రేవంత్ సర్కారు ఇంకా వలవిసరడం అంటూ జరగలేదు. అయినా సరే.. ఇప్పటికే పలువురు ఎంపీలు ఆయనతో టచ్ లోనే ఉన్నారు. కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ పువ్వు రాబోయే రోజుల్లో రేకలు రాలిపోయి తొడిమ, ముళ్లు మాత్రమే మిగులుతుందని పలువురు అనుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?