Advertisement

Advertisement


Home > Politics - Telangana

అమ్మ పాయె కొడుకు వచ్చె టాం..టాం..టాం..!

అమ్మ పాయె కొడుకు వచ్చె టాం..టాం..టాం..!

సోనియా కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండే మౌలిక లక్ష్యాల్లో ఒకటి. ఏ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. అక్కడి నాయకులు.. ఈ లక్ష్యసాధన దిశగా అహరహం శ్రమిస్తుంటారు. అందులో భాగంగానే.. తెలంగాణలో కాంగ్రెసు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి.. సోనియమ్మను ప్రసన్నం చేసుకోవడానికి ఆమెను ఇక్కడినుంచి ఎంపీగా పోటీచేయమని పదేపదే బతిమాలుతూ వచ్చారు.

తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు అత్యంత సేఫ్ సీట్లు కొన్ని ఉన్నప్పటికీ.. సోనియా మాత్రం అసలు ప్రత్యక్ష ఎన్నికలకే మొగ్గు చూపకుండా రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీ అయిపోయారు. ఈ నేపథ్యంలో సోనియమ్మ కుటుంబాన్ని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలనుకునే రాష్ట్ర నేతల ప్రయత్నాలు ప్రియాంక దిశగా మళ్లాయి. యిక్కడి నుంచి పోటీ చేయాలని ఆమెకు కూడా విన్నపాలు వెళ్లాయి. తీరా ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది.

తమ కుటుంబానికి మంచి పట్టున్న అమేథీ నుంచి మూడుసార్లు వరుసగా గెలిచిన ఈ హ్యాట్రిక్ హీరో గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. అలాంటి క్లిష్ట సమయంలో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం ఆయన పరుు కాపాడింది. ఆ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీచేసిన ఆయన వయనాడ్ లో గెలిచి లోక్ సభలో కొనసాగారు.

కానీ ఇప్పుడు వయనాడ్ లో ఈసారి పోటీచేయడం లేదన్నట్టు తెలుస్తోంది. సీట్ల పంపకాలు ఇంకా తేలకపోయినప్పటికా కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య యాని రాజా వయనాడ్ లో పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వయనాడ్ తో రాహుల్ బంధం తెగిపోయినట్టే. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఆహ్వానాన్ని అందుకున్న ప్రియాంక వధేరా తమ కుటుంబానికి ప్రియమైన సీటు రాయ్ బరేలీనుంచే పోటీకి సుముఖంగా ఉండగా.. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీచేయవచ్చునని వార్తలు వస్తున్నాయి.

తెలంగాణలో ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ పోటీ ఉండవచ్చునని అంటున్నారు. ఈ రెండూ కూడా అత్యంత సేఫ్ సీట్లు అని పార్టీ భావిస్తోంది. ఖమ్మంలో ఇప్పటికే పార్టీ టికెట్ కోసం చాలా పోటీ ఉంది. ఆ సీటు నాదే అని ప్రకటించుకున్న రేణుకా చౌదరి రాజ్యసభ ఎంపీ అయ్యారు.

అక్కడ టికెట్ కోసం దరఖాస్తు చేసిన వారిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య కీలకంగా రేసులో ఉన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కి టికెట్ ఆశిస్తున్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కొడుకును ఎంపీగా బరిలో దించాలని తలపోశారు గానీ.. ఇప్పుడు వెనక్కు తగ్గినట్టే. వీరందరి సంగతి ఇలా ఉంటే.. ఖమ్మంలో తాను ఎంపీగా పోటీ చేసి తీరుతానని.. ఎంతో సీనియర్ అయిన తన అవకాశాలను ఎవ్రవూ కాదనలేరని సీనియర్ నేత వి హనుమంత రావు చాలా గట్టిగానే చెప్పారు.

ఆ సీటుకు చాలా పోటీ ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వస్తే అంతా సద్దుమణగడం మాత్రమే కాదు. అందరూ కలిసి మెలిసి పార్టీ విజయానికి పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. రాహుల్ పోటీ వలన రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీకి కాస్త సానుకూల పవనాలు పెరుగుతాయని ఆశిస్తెున్నారు. మరి ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?