Advertisement

Advertisement


Home > Politics - Telangana

‘శ్రీమతికే జై’: కాంగ్రెసులో పీటముడి!

‘శ్రీమతికే జై’: కాంగ్రెసులో పీటముడి!

తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొందరిని ప్రకటించింది. ఇంకా కొన్ని స్థానాలు పెండింగులోనే ఉన్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లోగా మొత్తం ప్రకటన పూర్తవుతుందని సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కాంగ్రెసుకు గెలుపు గ్యారంటీ అనే భావన ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఇంకా పెండింగులోనే ఉండడాన్ని గమనించవచ్చు.

గెలిచే సీట్లు గనుక.. ఆ స్థానాల కోసం పోటీ ఎక్కువగా ఉన్నదని అర్థమవుతోంది. అయితే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, తమ కుటుంబానికి, తన భార్యకు టికెట్ ఇవ్వాలని పట్టుపడుతుండడం కూడా సీట్లు ఇలా పెండింగులో పడడానికి ఒక కారణం అని తెలుస్తోంది.

తెలంగాణ నుంచి సోనియాగాంధీ కుటుంబాన్ని పోటీచేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ చాలా ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలేం ఫలించినట్టు లేదు. సోనియా ఎటూ రాజ్యసభకు వెళ్లిపోయారు. ప్రియాంకను, రాహుల్ ను కూడా ఆహ్వానించారు గానీ.. రాహుల్ దక్షిణాదిలో తిరిగి వయనాడ్ నుంచే బరిలో దిగుతున్నారు. ప్రియాంక కూడా తెలంగాణకు వచ్చే సూచన కనిపించడం లేదు. ఆ నేపథ్యంలో పోటీ అంతా రాష్ట్ర నాయకుల మధ్యనే ఉంటోంది.

పీటముడి బిగిసిన వాటిలో ఖమ్మం, భువనగిరి స్థానాలకు నేతలు- ‘శ్రీమతికి టికెట్ ఇవ్వాలని’ పట్టుపడుతుండడం విశేషం. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  ఖమ్మంలో తన శ్రీమతి నందినికి టిక్కెట్ కావాలని పట్టుపడుతున్నారు. అదే కోవలోకి ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం కూడా చేరింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన శ్రీమతి లక్ష్మికి భువనగిరి టికెట్ ఆశిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెసు పార్టీని వీడి బిజెపిలోకి వెళ్లిపోయి రాజీనామా చేసి కమలబలంతో ఉపఎన్నికలో పోటీచేసి దారుణంగా ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి.. సరిగ్గా ఎన్నికలకు ముందుగా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అంతటి అవకాశవాదానికి ప్రతీక అయినప్పటికీ.. గెలిచిన తర్వాత అన్నయ్యతో పాటు తనకు కూడా మంత్రి పదవి కావాలని ఆశించారు.

ఇప్పటికీ తనకు మంత్రి పదవి వస్తుందనే అంటున్నారు. దానితో పాటూ.. తన శ్రీమతి లక్ష్మికి ఎంపీ టికెట్ కూడా కావాలంటున్నారు. తన భార్యకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్న రాజగోపాల్.. తద్వారా వేరేవారికి టికెట్ ఇస్తే భువనగిరి లో పార్టీని ఓడిస్తానని సంకేతాలు ఇస్తున్నారేమో అర్థం కావడం లేదు. మొత్తానికి కాంగ్రెసులో ఈ నేతలు కోరుతున్న  ఫ్యామిలీ ప్యాకేజీలు ఎటు తిరుగుతాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?