Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆ బ్రాండ్ లేక‌పోతే...బ్రాందీ షాపులో ప‌నిచేయ‌డానికి కూడా!

ఆ బ్రాండ్ లేక‌పోతే...బ్రాందీ షాపులో ప‌నిచేయ‌డానికి కూడా!

మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి మ‌రోసారి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ బ్రాండ్ లేక‌పోతే క‌నీసం బ్రాందీషాపులో ప‌ని చేయ‌డానికి కూడా రాజ‌గోపాల్‌రెడ్డి ప‌నికి రాడ‌ని రేవంత్‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ను రేవంత్‌రెడ్డి తిట్ట‌డంపై ఎంపీ వెంక‌ట‌రెడ్డి ఘాటుగా స్పందిన సంగతి తెలిసిందే.

త‌మ కుటుంబ బ్రాండ్‌ను కించ‌ప‌రిచేలా రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌లు చేశార‌ని వెంక‌ట‌రెడ్డి వ్యాఖ్యానించ‌డంపై ఇవాళ రేవంత్‌రెడ్డి స్పందించారు. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిని తాను ఏమీ అన‌లేద‌న్నారు. రాజ‌గోపాల్‌రెడ్డిని మాత్ర‌మే తాను విమ‌ర్శించాన‌న్నారు. కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ద్రోహి అని మ‌రోసారి రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్ కుటుంబ స‌భ్యుడ‌ని, రాజ‌గోపాల్ రెడ్డి కాద‌ని స్ప‌ష్టం చేశారు.

రాజ‌గోపాల్‌రెడ్డి, వెంక‌ట‌రెడ్డి వేర్వేర‌ని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డిని విమ‌ర్శించాన‌న‌డంలో నిజం లేద‌న్నారు. త‌మ మ‌ధ్య కొంద‌రు అగాథం పెంచుతున్నార‌ని రేవంత్‌రెడ్డి అన్నారు. గ‌తంలో వెంక‌ట‌రెడ్డి చెప్ప‌డం వ‌ల్లే రాజ‌గోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుంద‌న్నారు. 

రాజ‌గోపాల్‌రెడ్డికి బ్రాండ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఆ బ్రాండే లేక‌పోతే క‌నీసం బ్రాందీ షాపులో ప‌ని చేయ‌డానికి కూడా రాజగోపాల్‌రెడ్డి ప‌నికి రాడ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు స‌భ‌కు వెంక‌ట‌రెడ్డి వ‌స్తాడ‌ని రేవంత్ చెప్పారు.  

మ‌రోవైపు ఇక‌మీద‌ట రేవంత్‌రెడ్డి మొహ‌మే చూడ‌న‌ని ఇవాళ వెంక‌ట‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య చేయ‌డం గ‌మ‌నార్హం. వీళ్లిద్ద‌రి మ‌ధ్య కాంగ్రెస్ పార్టీ స‌యోధ్య కుదుర్చుతుందా? లేక వెంక‌ట‌రెడ్డిని బ‌య‌టికి పంపుతుందా? అనేది తేలాల్సి వుంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్‌ను అంత‌ర్గ‌త క‌ల‌హాలు తీవ్రంగా డ్యామేజీ చేస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా