Advertisement

Advertisement


Home > Politics - Telangana

రేవంత్ మాటల్లో అసలు మీనింగ్ వేరే ఉందా?

రేవంత్ మాటల్లో అసలు మీనింగ్ వేరే ఉందా?

తెలంగాణ ముఖ్యమంత్రి తనదైన శైలిలో విరుచుకుపడిపోతూ పరిపాలన సాగించుకుంటూ పోతున్నారు. ఆరు గ్యారంటీల గురించి పదేపదే ప్రస్తావిస్తూ.. అవి పార్లమెంటు ఎన్నికలు పూర్తయ్యేదాకా అమల్లోకి రావని గగ్గోలు పెడుతూ.. భారాస నాయకులు దుమ్మెత్తిపోసిన కష్టం మొత్తం వృథా అయిపోతోంది. మరి కొన్ని రోజుల వ్యవధిలోనే 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు అమల్లోకి రాబోతున్నాయి. ఆ రకంగా అసలు ఆ విమర్శలను నెత్తికెత్తుకోవడం ద్వారా భారాస సెల్ఫ్ గోల్ వేసినట్లయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలను గమనిస్తోంటే.. ఆ మాటల్లో దాగిన అర్థాలు చాలా చాలా కనిపిస్తున్నాయి.

ఓడిపోయినా సరే ఆ నలుగురి ఘోషే వినిపిస్తోంది.. అని సీఎం రేవంత్ రెడ్డి భారాస విమర్శల గురించి ఎద్దేవా చేశారు. ఓడిపోయినంత మాత్రాన ప్రతిపక్షం నోరు మూసుకుని కూర్చుని ఉండాలనుకుంటే అది కరెక్టు కాదు. ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వవ నిర్ణయాల్లో తప్పులను వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి.. రేవంత్ మాటల్లో ఆ పార్ట్ ను విస్మరిస్తే.. ‘ఆ నలుగురి ఘోష మాత్రమే’ వినిపిస్తోందని అనడం గురించి ఆలోచించాలి.

‘ఆ నలుగురు’ అని ఆయన అంటున్నారంటే దాని అర్థం.. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాలకపక్షం తుమ్మినా దగ్గినా అందులో తప్పులెన్నడమే పనిగా వారు వ్యవవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.

కానీ, ‘ఆ నలుగురు మాత్రమే’ ఘోష పెడుతున్నారని రేవంత్ అంటున్నారంటే.. దాని భావం మిగిలిన ఎవ్వరూ నోరు మెదపడం లేదని! ఒక రకంగా అది నిజమే. భారాసలోని ఈ నలుగురు నాయకులకు మద్దతుగా, అతి కొద్ది మంది సీనియర్లు మాత్రమే ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. పార్టీ తరఫున గెలిచిన వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు సైలెన్స్ పాటిస్తున్నారు. ఆ మాటకొస్తే.. చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెసుతో టచ్ లో ఉన్నారు. గులాబీ ఎమ్మెల్యేలు ‘నియోజకవర్గ అభివృద్ధి’ అనే సాకు పెట్టుకుని వచ్చి ముఖ్యమంత్రిని కలిసి వెళుతోంటే.. ఇక వారినుంచి ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలను ఆశించగలరు.

ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ ను కలిసి వెళ్లిన తర్వాత.. తాము సాధారణంగానే వెళ్లి కలిశామని, అంతే తప్ప కాంగ్రెసులో చేరడం లేదని వారితో భారాస అధిష్ఠానం ప్రకటనలు చేయించగలుగుతోంది తప్ప.. వారి నోటితో రేవంత్ ప్రభుత్వాన్ని తిట్టించలేకపోతోంది. అందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వాన్ని నిందించడంలో చురుగ్గా ఘాటుగా ఉండాలని పార్టీ హైకమాండ్ కోరుతున్నది గానీ.. పట్టించుకుంటున్న వారు తక్కువ.

రేవంత్ మాటల్లో అసలు అంతరార్థం అదే. అంటే తిట్టకుండా లౌక్యం పాటిస్తున్న ఎమ్మెల్యేలు అందరూ.. కాంగ్రెసుతో టచ్ లో ఉన్నారన్నమాట. రేవంత్ గేట్లు తెరవగానే.. వారంతా పోలోమని కాంగ్రెసులో చేరిపోయినా ఆశ్చర్యం లేదు అని పలువురు భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?