చంద్రబాబుకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా. అదసలు నమ్మదగ్గ విషయమేనా. తన శ్వాసనే రాజకీయ ఆశగా మార్చుకున్న చంద్రబాబు ఎన్నికల వేళ అందులోనూ సీట్ల ఎంపిక విషయంలో ఎంత అలెర్ట్ గా ఉంటారో తెలియదా. కానీ బాబుకు తెలియకుండా ఆయన దృష్టికి రాకుండా ఒక సీటు ప్రకటన జరిగిపోయిందట.
అదే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ సీటు. ఈ సీటు విషయం చంద్రబాబుకు తెలియకుండా జరిగింది అని మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత పీలా గోవింద్ అంటున్నారు. అనకాపల్లి సీటు టీడీపీకి కంచుకోట అని అలాంటి సీటుని తాము వదులుకోమని చెబుతున్నారు.
ఈ సీటు జనసేనకు ఇచ్చారని మూడు రోజుల క్రితం ప్రకటన వచ్చింది. తొలి జాబితాలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేరు ఉంది. దాంతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా టీడీపీ తమ్ముళ్ళు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పీలా గోవింద్ ని ఇండిపెండెంట్ గా పోటీ చేయమని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఆయన వారిని సముదాయిస్తూనే బాబుతో మాట్లాడి వస్తాను అంటున్నారు. రెండు రోజులు తమకు టైం ఇవ్వమని తన అనుచరులను కోరుతున్నారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడిన మాటలు కాస్తా ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి.
అనకాపల్లి సీటు విషయం చంద్రబాబుకు తెలియకుండా ప్రకటన చేశారు అని ఆయన అంటున్నారు. చంద్రబాబు పక్కనే జనసేన అధినేత పవన్ ఉన్నారు. ఉమ్మడిగానే లిస్ట్ ప్రకటించారు. అనకాపల్లి జనసేనకు ఇస్తున్న సంగతి బాబుకు తెలియకుండా ఎలా ఉంటుంది అన్నది అంతా ఆలోచిస్తున్న విషయం.
అయితే పీలా గోవింద్ మాత్రం ఈ సీటుని టీడీపీ సాధించుకుంటుందని ధీమాతో ఉన్నారు. ఒకవేళ అనుకున్నట్లుగా జరగకపోతే మాత్రం ఆయన ఒక తీవ్రమైన నిర్ణయమే తీసుకుంటారు అని అంటున్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే వైసీపీ లో ఆయన చేరుతారు అని ప్రచారం సాగుతోంది. అనకాపల్లి సీటు మాత్రం చిచ్చు రేపేలా ఉందని పొత్తు విషయంలో కొత్త నిప్పు రాజేసేలా ఉందని అంటున్నారు.