చకచకా సినిమాలు చేయడమే కాదు, అంతే స్పీడుగా మంచి ప్రాజెక్టులు పట్టడంలో కూడా దిట్ట నాని. ఎప్పుడు ఏ సినిమా పడితే బాగుంటుంది, ఏ సినిమా తర్వాత ఏ సినిమా వస్తే బాగుంటుందనే సమీకరణాల్లో నాని పండిపోయాడు. ఈ రేంజ్ హీరోల్లో ప్రస్తుతం నాని దగ్గర మాత్రమే బెస్ట్ లైనప్ ఉంది.
ప్రస్తుతం 'సరిపోదా శనివారం' అనే సినిమా చేస్తున్నాడు నాని. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకుడు. ఈ మూవీ తర్వాత నాని సెట్ చేసుకున్న సినిమాలన్నీ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి.
సుజీత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను ప్రకటించాడు నాని. రేపోమాపో బలగం దర్శకుడు వేణుతో సినిమా ప్రకటన కూడా రాబోతోంది. ఇక చేతిలో దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల సినిమా ఉండనే ఉంది. వీటితో పాటు ఓ తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి కూడా నాని రెడీ అవుతున్నాడు.
ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాల్ని సెట్ చేసుకున్నాడు నాని. అయితే వీటిలో ఏది ముందుగా సెట్స్ పైకి వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
సరిపోదా శనివారం పూర్తయ్యేసరికి, సుజీత్ అందుబాటులోకి వస్తే ఆ ప్రాజెక్టు ముందుగా పట్టాలపైకి వస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే బలగం వేణుతో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు. అన్నట్టు తెలుగులో ఓ పెద్ద డైరక్టర్ కూడా నానితో సినిమా చేస్తాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. అది ఎప్పుడో మరి.