Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఇంతకూ రేవంత్ గేట్లు తెరిచినట్టేనా ?

ఇంతకూ రేవంత్ గేట్లు తెరిచినట్టేనా ?

తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కిందట ప్రకటించారు. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన గేట్లు తెరుస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ కు ముందే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించేందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇది లోక్ సభ ఎన్నికల ప్రత్యేక అవసరానికి తగినట్టుగా జరుగుతున్న ఫిరాయింపు మాత్రమేనని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గంపగుత్తగా చేర్చుకోవడం అనేది పార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ తాజాగా తాను కాంగ్రెసు పార్టీలో చేరుతున్న సంగతిని ప్రకటించారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అరగంటకు పైగా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలవడం, తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి పనుల గురించి కలిశామని బయటకు వచ్చాక ప్రకటించడం చాలానే జరిగాయి.

అయితే భేటీ తర్వాత.. రెండుమూడు రోజుల్లో కాంగ్రెసులో చేరబోతున్నట్టుగా ప్రకటించిన మొదటి సిటింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావడం విశేషం. అందుకు తగినట్టుగా నాగేందర్, ముఖ్యమంత్రితో భేటీ అయిన సమయంలో పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

దానం నాగేందర్ ను సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేలా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుచేతనే ఆయన ఇప్పుడే పార్టీ మారుతున్నారని, దీనిని కాంగ్రెస్ గేట్లు తెరిచినట్లుగా భావించనక్కర్లేదని పార్టీలో కొందరు అంటున్నారు. ఆ పర్వం ఇంకా ముందుందని అంటున్నారు.

మరోవైపు వరంగల్ సిటింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా రేవంత్ రెడ్డితో కలిశారు. ఈ ఇద్దరు నాయకులు కూడా సోమవారం కాంగ్రెసు పార్టీలో అధికారికంగా చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పసునూరి దయాకర్ సిటింగ్ ఎంపీగా ఉండగా ఆయనకు తిరిగి టికెట్ ఇవ్వకుండా భారాస నిరాకరించింది. వరంగల్ స్థానానికి ఆరూరి రమేష్ ను అభ్యర్థిగా ఎంపిక చేయాలని అనుకోగా ఆయన వద్దని చెప్పారు. ఆయన భాజపాలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు వినిపిస్తోంది.

ఒకవైపు పసునూరి దయాకర్, మళ్లీ టికెట్ ఇస్తే తాను పోటీచేస్తానని అంటున్నప్పటికీ ఆయనను పట్టించుకోకుండా కడియం శ్రీహరి కూతురు కావ్యకు కేసీఆర్ టికెట్ ప్రకటించారు. దీంతో మనస్తాపానికి గురైన పసునూరి దయాకర్ కాంగ్రెసులో చేరిపోతున్నారు.

మొత్తానికి సిటింగు ఎమ్మెల్యేల వలసలు భారాసనుంచి కాంగ్రెసులోకి ప్రారంభం అయినట్టే. ఈ చేరికతో ప్రస్తుతానికి జంటనగరాల పరిధిలోకూడా కాంగ్రెసుకు ఒక ఎమ్మెల్యే సీటు ఉన్నట్టు అవుతుంది. పూర్తిగా గేట్లు తెరిస్తే.. ఇంకా ఎంత మంది వలసలు రాబోతున్నారో వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?